CT2025: టీమిండియా జైత్రయాత్ర
న్యూజిలాండ్ పై విజయకేతనం... కివీస్ ను తిప్పేసిన వరుణ్ చక్రవర్తి;
ఐసీసీ చాంపియన్స్ టోర్నీలో టీమిండియా విజయాల పరంపర కొనసాగుతోంది. గ్రూప్ దశలో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచులో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. న్యూజిలాండ్ పై 44 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. దుబాయ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 249 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (79 ) టాప్ స్కోరర్ గా నిలిచాడు. కివీస్ బౌలర్ అయిదు వికెట్లతో చెలరేగడంతో భారత జట్టు 249 పరుగులకే పరిమితమైంది. అనంతరం 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్... 205 పరుగులకే పరిమితమైంది. వరుణ్ చక్రవర్తి.. చక్ర వ్యూహంలో చిక్కి న్యూజిలాండ్ ఉక్కిరి బిక్కిరి అయింది. స్పిన్నర్ల మాయాజాలంతో కివీస్ లక్ష్యానికి 44 పరుగుల దూరంలోనే ఆగిపోయింది.
మెరిసిన అయ్యర్..
ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో శ్రేయాస్ (79), పాండ్యా (45), అక్షర్ పటేల్ (42), కేఎల్ రాహుల్ (23) రన్స్ చేశారు. రోహిత్ శర్మ (15), శుభ్‌మన్ గిల్ (2), విరాట్ కోహ్లీ (11) నిరాశపర్చడంతో భారత్ 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్, అక్షర్ పటేల్ టీమ్‌ఇండియాను ఆదుకున్నారు. ఈ జోడీ నాలుగో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. చివర్లో హార్దిక్ మెరుపులు మెరిపించడంతో భారత్ పోరాడే స్కోరు సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 5 వికెట్లతో చెలరేగగా.. జేమీసన్, విల్, మిచెల్, రవింద్ర తలో వికెట్ తీశారు.
వరుణ్ చక్రవర్తి తిప్పేశాడు
250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ను... టీమిండియా స్పిన్నర్లు తిప్పేశారు. నలుగురు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగింది. వరుణ్ ఐదు వికెట్లు తీసి, సత్తా చాటాడు. ఛేజింగ్ ఆరంభంలోనే కివీస్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు విల్ యంగ్ (22), రచిన్ రవీంద్ర (6) వికెట్లను త్వరగానే కోల్పోయింది. ఈ దశలో విలియమ్సన్ ఒంటరిపోరాటం చేశాడు. ఒక ఎండ్ లో నిలబడి, పరుగులు సాధిస్తూ, స్కోరుబోర్డును మందుకు నడిపించాడు. కేన్ విలియమ్సన్ (120 బంతుల్లో 81, 7 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. 41వ ఓవర్‌లో అక్షర్ పటేల్ వేసిన చివరి బంతిని కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి కేన్ విలియమ్సన్ ఔట్ కావడంతో కివిస్ ఆశలు ఆవీరయ్యాయి. భారత స్పిన్నర్లను ఎదుర్కోవడంలో కివీస్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ముఖ్యంగా మిడిలార్డర్లో ఘోరంగా తడబడ్డారు. చివరికి 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటయ్యింది. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు, కుల్దీప్ యాదవ్ రెండు, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు.