Chess Olympiad 2024: చరిత్ర సృష్టించారు... పసిడి పట్టేశారు

చెస్‌ ఒలింపియాడ్‌లో తొలిసారి స్వర్ణాలు సొంతం … అదరగొట్టిన భారత బంగారాలు;

Update: 2024-09-23 01:15 GMT

బుడాపెస్ట్ వేదిక‌గా జ‌రుగుతున్న చెస్ ఒలింపియాడ్‌లో భార‌త్ సరికొత్త చ‌రిత్ర సృష్టించింది. చెస్ ఒలింపియాడ్ లో తొలిసారి రెండు గోల్డ్ మెడ‌ల్స్‌ గెలుచుకుంది. ఓపెన్ సెక్షన్‌లో గ్రాండ్ మాస్టర్ డీ గుకేష్ అద్భుత ప్రదర్శన చేసి తొలి బంగారు పతకం కైవసం చేసుకోగా... మహిళల జట్టు కూడా మరో స్వర్ణం సాధించడంతో భారత్‌ చరిత్ర సృష్టించింది. 45వ ఫిడే పోటీల్లో భార‌త ప్లేయ‌ర్లు డీ గుకేశ్, ఆర్ ప్రజ్ఞానంద, అర్జున్ ఎరిగైసి, విడిత్ గుజరాతి, పెంటల హరికృష్ణ, శ్రీనాథ్ నారాయన్ వారి గేమ్ ల‌లో స‌త్తా చాట‌డంతో భార‌త పురుషుల జ‌ట్టు గోల్డో మెడ‌ల్ గెలుచుకుంది. ర‌ష్యా ఆటగాడు వ్లాదిమిర్ ఫెడోసీవ్‌పై డీ గుకేశ్ విజయం సాధించడంతో దేశానికి గోల్డ్ మెడల్ వచ్చింది. మహిళల విభాగంలో హారిక ద్రోణవల్లి, ఆర్ వైశాలి, దివ్య దేశ్‌ముఖ్, వంటికా అగర్వాల్, తానియా సచ్‌దేవ్‌లతో కూడిన భారత మహిళల చెస్ జట్టు గోల్డ్ మెడల్ ను గెలుచుకోవడంతో భారత్ రెండో స్వర్ణం అందుకుంది. కజకిస్థాన్‌ను అమెరికా ఓడించడంపైనే ఓపెన్ విభాగంలో భారత జట్టు విజయం ఆధారపడి ఉంది. అమెరికా తన ప్రత్యర్థిని 1-1తో డ్రా చేయడంతో భారత్‌ను విజేతగా ప్రకటించారు.

అదరగొట్టేశారు

ఓపెన్‌ విభాగంలో భారత పురుషుల జట్టు 21 పాయింట్లతో పసిడిని సొంతం చేసుకుంది. 11వ రౌండ్లో భారత్‌ 3.5-0.5 తేడాతో స్లోవేనియాను చిత్తుచేసింది. అమ్మాయిలు కూడా 3.5-0.5 తేడాతోనే అజర్‌బైజాన్‌ను ఓడించారు. ఓపెన్‌లో 10 రౌండ్లు ముగిసే సరికి భారత్‌ 19, చైనా 17 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఈ నేపథ్యంలో ఆఖరి రౌండ్లో భారత్‌ టై చేసుకున్నా విజేతగా నిలిచేది. కానీ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ మన కుర్రాళ్లు విజయ ఢంకా మోగించారు. మరోవైపు బంగారు పతకాన్ని సొంతం చేసుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన చివరి రౌండ్లో భారత అమ్మాయిలు తీవ్ర ఒత్తిడిని దాటి అత్యుత్తమ ప్రదర్శన చేశారు. హారిక.... మమ్మాద్‌జాదాపై 51 ఎత్తుల్లో గెలిచి భారత విజయాన్ని ఖరారు చేసింది. చివరగా ఖానిమ్‌ను 53 ఎత్తుల్లో చేసిన వంతిక భారత్‌కు అదిరే ముగింపునిచ్చింది. మరోవైపు కజకిస్థాన్, అమెరికా మధ్య పోరు 2-2తో టై కావడంతో భారత అమ్మాయిలకే కిరీటం దక్కింది.

Tags:    

Similar News