Dale Steyn : ఎస్ఆర్హెచ్కు డేల్ స్టెయిన్‌ గుడ్ బై

Update: 2024-10-18 05:00 GMT

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను వదిలేస్తున్నట్లు డేల్ స్టెయిన్‌ ప్రకటించాడు. గత సీజన్‌లోనే వ్యక్తిగత కారణాల వల్ల ఎస్ఆర్‌హెచ్‌కు దూరమైన అతడు.. కొత్త ఎడిషన్‌కు అందుబాటులో ఉండనని స్పష్టంచేశాడు. అయితే, సౌతాఫ్రికా 20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్‌ కేప్‌కు మాత్రం బౌలింగ్‌ కోచ్‌గా ఉంటానని వెల్లడించాడు. గత రెండుసార్లు ఈస్టర్న్‌ కేప్‌ ఛాంపియన్‌గా నిలిచింది. హ్యాట్రిక్ సాధించేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపాడు. ‘క్రికెట్ అనౌన్స్‌మెంట్. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ధన్యవాదాలు. గత కొన్నేళ్లుగా బౌలింగ్‌ కోచ్ అవకాశం ఇచ్చినందుకు రుణపడి ఉంటా. దురదృష్టవశాత్తూ ఐపీఎల్ 2025 సీజన్‌ కోసం ఎస్‌ఆర్‌హెచ్‌తో కలిసి పనిచేయలేకపోతున్నా. కానీ, ఎస్‌ఏ 20 లీగ్‌లో మాత్రం సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో పనిచేస్తా. ఇప్పటికే మేం రెండుసార్లు విజేతగా నిలిచాం. దానిని హ్యాట్రిక్‌ చేస్తామన్న నమ్మకం ఉంది’ అని స్టెయిన్‌ వెల్లడించాడు. డేల్ కేవలం కోచ్‌గానే కాకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకూ ప్రాతినిధ్యం వహించాడు. టైటిల్‌ విజేతగా నిలిచిన 2016 సీజన్‌తోపాటు 2018లో ఫైనల్స్‌కు వెళ్లడంలో డేల్ కీలక పాత్ర పోషించాడు. గత సీజన్‌లో డేల్‌ స్థానంలో న్యూజిలాండ్ మాజీ పేసర్ జేమ్స్ ఫ్రాక్లిన్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ తాత్కాలిక బౌలింగ్‌ కోచ్‌గా నియమించింది. ఇప్పుడు డేల్ స్థానంలో అతడికే పూర్తిస్థాయి పగ్గాలు అప్పగించే అవకాశం లేకపోలేదు.

Tags:    

Similar News