Aus vs Eng : ఇంగ్లండ్ ఘన విజయం.. నాలుగో వన్డేలో ఆసీస్ చిత్తు

Update: 2024-09-28 14:00 GMT

తొలుత తడబడిన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు.. ఇప్పుడు అదరగొడుతోంది. లార్డ్స్‌ వేదికగా జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్‌ 186 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌ను వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించడం జరిగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 312/5 స్కోరు చేసింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (87), లియాన్ లివింగ్‌స్టోన్ (62*), డకెట్ (63) హాఫ్ సెంచరీలు సాధించారు. జామీ స్మిత్ (39), ఫిల్‌ సాల్ట్ (22) ఫర్వాలేదనిపించారు. ఆసీస్‌ బౌలర్‌ మిచెల్ స్టార్క్‌ 8 ఓవర్లలో ఒక్క వికెట్‌ లేకుండానే 70 పరుగులు సమర్పించాడు. ఆడమ్‌ జంపా (2/66), హేజిల్‌వుడ్ (1/40), మాక్స్‌వెల్ (1/30), మిచెల్ మార్ష్ (1/26) వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఆసీస్‌ 24.4 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటైంది.

కుప్పకూలిన ఆసీస్‌

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు మంచి ఆరంభమే దక్కింది. తొలి వికెట్‌కు ట్రావిస్ హెడ్ (34), మిచెల్ మార్ష్ (28) 68 పరుగులు జోడించారు. ఓపెనింగ్‌ జంట ఎప్పుడైతే విడిపోయిందో అప్పట్నుంచి కంగారూల జట్టుకు కష్టాలు మొదలయ్యాయి. మ్యాథ్యూ పాట్‌ (4/38), జోఫ్రా ఆర్చర్ (2/33), కార్సే (3/36), అదిల్ రషీద్ (1/11) విజృంభించడంతో ఆసీస్‌కు చుక్కలు కనిపించాయి. కేవలం 58 పరుగుల వ్యవధిలోనే పది వికెట్లను కోల్పోవడం గమనార్హం. ఓపెనర్లతోపాటు అలెక్స్ కేరీ (13), సీన్ అబాట్ (10) మాత్రమే రెండంకెల స్కోరును సాధించారు. మిగతా వారు ఘోరంగా విఫలమయ్యారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును హ్యారీ బ్రూక్ సొంతం చేసుకున్నాడు. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 2-2 సమంగా నిలిచింది.

Tags:    

Similar News