AusW vs EngW: చివరి వన్డేలో ఇంగ్లాండ్‌దే గెలుపు, సిరీస్ వశం
వర్షం కారణంగా ఓవర్లు కుదించడంతో డక్ వర్త్ లూయీస్ పద్ధతిలో 69 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపొందింది;
ఇంగ్లాండ్ క్రీడాకారిణి నాట్ స్కూవర్ బ్రంట్(Nat Sciver-brunt) సెంచరీ(129)తో చెలరేగడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డేలో గెలిచింది. ఈ గెలుపుతో 2-1 తేడాతో సిరీస్‌ని కూడా గెలుచుకుంది. వర్షం కారణంగా ఓవర్లు కుదించడంతో డక్ వర్త్ లూయీస్(D/L) పద్ధతిలో 69 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా(Australia)పై గెలుపొందింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నాట్ స్కైవర్ బ్రంట్ ఎంపికైంది.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఇంగ్లాండ్‌ని బౌలింగ్‌కి ఆహ్వానించింది. వర్షం కారణంగా 44 ఓవర్లలో 269 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలో దిగిన ఆస్ట్రేలియా క్రీడాకారిణులు ఛేదనలో తడబడ్డారు. ఇన్నింగ్స్ మొదలైన 13 బంతుల్లోనే 2 వికెట్లను కోల్పోయింది. 1.5 ఓవర్ వద్ద లిఛ్‌ఫీల్డ్ స్లిప్‌లో దొరికిపోగా, తరువాతి ఓవర్ మొదటి బంతికే మరో ఓపెనర్, కెప్టెన్ అలీస్సా హీలీ క్లీన్‌బౌల్డై వెనుదిరిగింది. నిలకడగా ఆడిన మెక్‌గ్రాత్, పెర్రీలు స్కోర్‌బోర్డును పెంచారు.
13వ ఓవర్లో క్రీజు వదిలి వచ్చి ఆడిన తాహిలా మెక్‌గ్రాత్ స్టంపౌంట్‌గా వెనుదిరిగింది. పెర్రీ, మూనేలు మరో వికెట్ పడకుండా ఆడుతూ స్కోర్‌ను 100 పరుగులు దాటించారు. ఈ క్రమంలో ఓ సిక్సర్‌తో 55 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. తర్వాతి ఓవర్లోనే లెగ్‌సైడ్ ఆడబోయి బాల్ గాల్లోకి లేవడంతో 4వ వికెట్‌గా వెనుదిరిగింది. మరో బ్యాట్స్‌ఉమెన్ మూనే కూడా 16 పరుగులు చేసి 130 పరుగుల వద్ద ఔటయింది. 97 బంతుల్లో 104 పరుగులు అవసరమైన దశలో లేని డబుల్ కోసం పరుగెత్తి క్రీజులో కుదురుకున్న ఆష్లే గార్డ్‌నర్ ఔటయ్యింది. తర్వాత 4 వికెట్లు తీయడడానికి ఇంగ్లాండ్‌కి చాలా సమయం పట్టలేదు. మరో 33 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌ఉమెన్ బ్రంట్ ఈ సిరీస్‌లో వరుసగా 2వ సెంచరీతో చేయడంతో ఇంగ్లాండ్ 285 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ మొదటి 2 ఓవర్లలోనే ఓపెనర్లు ఇద్దరి వికెట్లను కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన బ్రంట్, హీథర్ నైట్(67)లు క్రీజులో కుదురుకురుకుని స్కోర్ బోర్డుని 150 పరుగులు దాటించారు. అర్ధసెంచరీ చేసిన నైట్ 158 పరుగుల వద్ద 3వ వికెట్‌గా ఔటయింది. మరోవైపు బ్రంట్ 125 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుంది. డానీ వ్యాట్‌తో కలిసి స్కోర్‌ని 150 దాటించారు. ముఖ్యంగా వ్యాట్ సిక్సులతో విరుచుకుపడింది. దీంతో రన్‌రేట్ 5.5 పరుగులకు చేరింది. 244 పరుగుల వద్ద 5వ వికెట్‌గా బౌల్డయింది. 48వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి బ్రంట్ పెవిలియన్ చేరింది. ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటయింది.