GILL: టీమిండియాలో ఆరంభమైన గిల్ శకం
భారత్ టెస్టు జట్టులో మొదలైన కొత్త శకం.. టీమిండియాలో శుభ్‌మన్ గిల్ శకం ఆరంభం... ఇంగ్లాండ్ సిరీస్‌లో కెప్టెన్‌గా శుభ్‌మన్ మార్క్;
ఇంగ్లండ్‌లో ముగిసిన టెస్ట్ సిరీస్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన యువ సంచలనం శుభ్‌మన్ గిల్ అసాధారణ ప్రదర్శనతో అందరినీ అబ్బురపరిచాడు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకుని కెప్టెన్‌గానూ.. బ్యాటర్‌గానూ ఈ సిరీస్‌లో తనదైన ముద్ర వేశాడు. జట్టుకు అవసరమైన ప్రతీ సందర్భంలోనూ బ్యాటుతో అద్భుతాలు చేశాడు. అండర్సన్- టెండూల్కర్ సిరీస్‌తో భారత్ టెస్టు జట్టులో గిల్ శకం మొదలైనట్లే కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ లాంటి దిగ్గజాలు వీడ్కోలు పలికిన తరుణంలో, యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో టీమ్ఇండియా ఎలాంటి ఫలితాలు అందుకుంటుందో అనే సందేహాలు చాలా మందిలో కలిగాయి. గిల్ ఓ వైపు బ్యాటర్‌గా మరోవైపు నాయకుడిగా బ్యాలెన్స్‌గా వెళ్లగలడా అనే అనుమానాలను ఈ సిరీస్ పటాపంచలు చేసింది. తాజా ఇంగ్లాండ్ సిరీస్‌తో బ్యాటర్‌గానే కాదు, కెప్టెన్‌గానూ అందరికీ ఒక నమ్మకాన్ని కలిగించాడు. ఫైటింగ్ స్పిరిట్‌తో కొత్త ప్రయాణానికి టీమిండియా నవ సారధి శ్రీకారం చుట్టాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో గిల్ నాయకత్వం అందర్నీ ఆకట్టుకుంది.
బ్యాట్‌తో చెలరేగిన గిల్
విరాట్ కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్తో టీమ్ఇండియాలో స్టార్ బ్యాటర్ల శకం ముగిసింది. ఈ సమయంలో వారి లోటు పూడ్చడం కష్టమే అని.. ఇంగ్లాండ్ సిరీస్ లో భారత్ ఘోర వైఫల్యం తప్పదనే చాలామంది భావించారు. భారత జట్టును నడిపించే యువ నాయకుడిగా గిల్‌పై పెద్ద బాధ్యతే పడింది. కానీ, నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ, కెప్టెన్‌గా గిల్ బలంగా నిలబడ్డాడు. మొత్తం 10 ఇన్నింగ్స్‌ల్లో 754 పరుగులు చేసి గ్రాండ్ రికార్డు నెలకొల్పాడు. అతని ఆటలోని ఆత్మవిశ్వాసం, జట్టుని గట్టిగా నిలిపే తీరు స్పష్టంగా కనిపించాయి. ఎప్పుడూ గ్రౌండ్లో కూల్‌గా ఉండే, సిరీస్‌లో కొన్ని కీలక సమయంలో చురుకైన పాత్ర పోషించాడు. అయితే, రానున్న రోజుల్లో అతను ఇంకా గట్టిగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది. సిరీస్ ఆసాంతం టీమ్ఇండియ సమష్ఠి కృషితో రాణించింది. గిల్ 754 పరుగులతో సిరీస్‌లోనే టాప్ స్కోరర్‌గా నిలువగా, ఓపెనర్ కేఎల్ రాహుల్ 532 పరుగులతో ఆకట్టుకున్నారు. ఇక సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా సత్తా చాటాడు. బ్యాటింగ్‌లో 516 పరుగులు బాదిన జడ్డూ, బౌలింగ్‌లో 7 వికెట్లు తీసి రాణించాడు. రిషభ్ పంత్ 479 రన్స్ చేయగా, యంగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 411 విలువైన పరుగులు చేశాడు.
బౌలర్లపైనా స్పష్టమైన అవగాహన
బౌలింగ్ విభాగంలో బుమ్రా మూడు టెస్టుల్లో 14 వికెట్లు తీసి మళ్లీ తన స్థాయిని నిరూపించాడు. అతని ఫిట్‌నెస్‌పై సందేహాలు ఉన్నా, ఆటలో ఉన్నప్పుడు మాత్రం గేమ్ ఛేంజర్‌గా నిలిచాడు. సిరాజ్ మాత్రం వరుసగా అన్ని మ్యాచ్‌ల్లో ఆడుతూ, టూర్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అయ్యాడు. వరుసగా ఓవర్స్, పేస్‌తో కీలక సమయంలో వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. ఈ సిరీస్‌లో బౌలింగ్ యూనిట్‌ను వినియోగించడంలో గిల్ మార్క్ కనిపించింది. సిరీస్ విజయం తర్వాత కూడా టీమ్ఇండియా జట్టుగా మరింత పట్టుదలతో ఆడాల్సిన అవసరం స్పష్టంగా కనిపించింది. ఒక్కో మ్యాచ్‌లో గెలుపు దాదాపుగా చేతిలో ఉన్నప్పుడు కూడా, కొన్నిసార్లు ఆధిక్యాన్ని ఇంగ్లాండ్‌కు అప్పగించిన సందర్భాలు వచ్చాయి. ఆల్రౌండర్లను ఆడించడం వల్ల స్పెషలిస్ట్ బౌలర్ కొరత కనిపించింది. దీంతో ముఖ్యమైన మ్యాచ్‌ల్లో విజయం ఒత్తిడిలో వచ్చింది.