HAMPI: ప్రపంచ వేదికపై హంపీ వెలుగులు
హంపీపై చంద్రబాబు, రేవంత్ ప్రశంసల జల్లు;
మహిళల వరల్డ్ కప్ సెమీఫైనల్స్‌కు చేరుకున్న తొలి భారత మహిళగా నిలిచిన కోనేరు హంపిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ప్రశంసల వర్షం కురిపించారు. "మన తెలుగు కుమార్తె ప్రపంచ వేదికపై కాంతులు విరజిమ్ముతోంది. గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపీ ఫిడే వరల్డ్ కప్ సెమీఫైనల్స్‌కు చేరుకున్న తొలి భారత మహిళగా నిలిచినందుకు అభినందనలు. నీ ఘనత దేశవ్యాప్తంగా మమ్మల్ని గర్వించేలా చేస్తోంది. ఇది కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదు.. భారతీయ చెస్‌కు గర్వకారణమైన క్షణం అని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని వ్యాఖ్యానించారు. టైటిల్‌ను ఇంటికి తీసుకురావాలని కోరారు.” అంటూ ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. "భారత చెస్‌కు చారిత్రక మైలురాయి! గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపీ ఫిడే మహిళల వరల్డ్ కప్ సెమీఫైనల్స్‌కు చేరుకున్న తొలి భారత మహిళగా నిలిచినందుకు హృదయపూర్వక అభినందనలు!” అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
రేవంత్ శుభాకాంక్షలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కోనేరు హంపికి శుభాకాంక్షలు తెలియజేశారు. వరల్డ్ కప్ సెమీస్ కు చేరిన హంపికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని రేవంత్ అన్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా హంపి నిలవడం తెలుగు ప్రజలకు గర్వకారణమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలో 1987లో జన్మించిన కోనేరు హంపి ఐదు సంవత్సరాల వయసులోనే తన తండ్రి కోనేరు అశోక్ ద్వారా చదరంగం ఆటను నేర్చుకుంది. 2002లో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించిన ఆమె, 2019, 2024లో మహిళల ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచింది.