HARSHITH RANA: హర్షిత్ రాణా.. ఈయన గంభీర్ తాలుకా
హర్షిత్ రాణాకు ప్రత్యేక సౌకర్యాలపై చర్చ.. గంభీర్ తాలుకా అంటూ మాజీల కామెంట్లు.. తరచూ జట్టులోకి ఎంపిక కావడంపై విమర్శలు
హర్షిత్ రాణా తరచూ భారత జట్టులోకి ఎంపిక కావడంపై క్రికెట్ వర్గాల్లో విమర్శలు, చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, టెస్ట్ జట్టులో లేకపోయినా ప్రత్యేక ఆహ్వానం మేరకు అతను గంభీర్ డిన్నర్‌కు హాజరవడం అతని గంభీర్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని మరోసారి స్పష్టం చేసింది. తనపై వస్తున్న విమర్శలను లెక్క చేయకుండా, హర్షిత్ రాణా తన గురువు ఇచ్చిన విందుకు ప్రత్యేకంగా హాజరవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇటీవల న్యూ ఢిల్లీలోని తన నివాసంలో టీమ్ ఇండియా టెస్ట్ జట్టు సభ్యులందరికీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. వెస్టిండీస్‌తో జరగబోయే చివరి టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరే ముందు జట్టు సభ్యుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంచడానికి ఈ డిన్నర్‌ను ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి టెస్ట్ జట్టులోని ఆటగాళ్లు, సహాయక సిబ్బంది హాజరయ్యారు. టీమిండియా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది దాదాపుగా అంతా ఒకే టీమ్ బస్సులో గంభీర్ నివాసానికి చేరుకున్నారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లంతా సాధారణ దుస్తుల్లో బస్సు దిగి నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్లారు. ఈ విందుకు భారత యువ పేసర్ హర్షిత్ రాణా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. టెస్ట్ జట్టులో భాగం కానప్పటికీ, హర్షిత్ రాణా విందుకు హాజరు కావడమే కాకుండా, జట్టు సభ్యులందరూ బస్సులో రాగా, అతను మాత్రం ప్రత్యేక ప్రైవేట్ కారులో విందుకు హాజరయ్యాడు. హర్షిత్ రాణా తన కారులో స్టైల్‌గా ఎంట్రీ ఇవ్వడం అక్కడి దృశ్యాలను ఫొటోలు, వీడియోలు తీస్తున్న మీడియా దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రత్యేక ప్రవేశానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హర్షిత్ రాణాకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మెంటర్‌షిప్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన అనుభవం ఉంది.
అతను గంభీర్ గారి తాలుకా..
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ క్రికెటర్ క్రిష్ శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. తమకు నచ్చిన ఆటగాళ్లనే భారత జట్టులోకి తీసుకుంటున్నాడని ఆరోపించాడు. ముఖ్యంగా యువ పేసర్ హర్షిత్ రాణాను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయడాన్ని తప్పుబట్టాడు. ఈ పర్యటన కోసం ఎంపిక చేసిన వన్డే జట్టులో భారత సెలెక్టర్లు సంచలన మార్పులు చేశారు. కేకేఆర్ ప్లేయర్‌గా హర్షిత్ రాణా.. గంభీర్‌కు ప్రియ శిష్యుడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. టీ20ల్లో అదరగొడుతున్న అర్ష్‌దీప్ సింగ్‌ను కాదని, హర్షిత్ రాణాను ఎంపిక చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
హర్షిత్ ఎందుకు: అశ్విన్
టీమిండియా ఏ సిరీస్ ఆడినా ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాకు జట్టులో అవకాశం దక్కుతోంది. ఇలాంటి నేపథ్యంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్షిత్ రాణాను ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారని నిలదీశారు. అడిగే వారు లేరని ఇష్టం వచ్చిన వాళ్లను సెలెక్ట్ చేస్తున్నారని పరోక్షంగా మండిపడ్డారు. దీనికి కారణం గంభీర్ అని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఐపీఎల్ మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డిని అద్భుతమైన పేస్ డెలివరీతో అవుట్ చేసినందుకు.. నేటికీ ఆ ఒక్క కారణంతోనే వరుస అవకాశాలు ఇస్తున్నారు’’ అని అశ్విన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.