భారత మహిళల హాకీ జట్టు తరఫున అత్యధిక మ్యాచులు ఆడిన వందన కటారియా అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. హాకీ ఇండియా లీగ్‌లో మాత్రమే ఆడతానని తెలిపారు. మొత్తం 320 మ్యాచులు ఆడిన వందన 158 గోల్స్ చేశారు. ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ గోల్ చేసిన భారత తొలి మహిళా ప్లేయర్‌గా రికార్డు సృష్టించారు. క్రీడా సేవలకు గుర్తుగా ఆమెను పద్మశ్రీ, అర్జున అవార్డులు వరించాయి. ‘అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలకాలన్న నిర్ణయం హఠాత్తుగా తీసుకోలేదు. చాలా మంది జూనియర్ ప్లేయర్లు తెరపైకి వస్తున్నారు. ఇప్పటికే 15 ఏళ్లుగా భారత జట్టుకు ఆడుతున్నాను. జూనియర్లకు కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయం తీసుకున్నాను’ అని వందన వ్యాఖ్యానించింది. ఇప్పటికిప్పుడు భవిష్యత్ ప్రణాళికల గురించి ఆలోచించలేదని... అయితే తనకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన హాకీకి తప్పకుండా సేవలు అందిస్తానని వందన తెలిపింది.