PRITHVI SHAW: తప్పుడు వ్యక్తులతో స్నేహం చేసి చెడిపోయా
పృథ్వీ షా సంచలన వ్యాఖ్యలు.. అంతా స్వయం కృతాపరాథమే అని వెల్లడి;
పృథ్వీ షా.. కొన్నేళ్ల క్రితం ఇండియన్ క్రికెట్లో మార్మోగిన పేరు. నెక్ట్స్ సచిన్ అంటూ... భవిష్యత్తు ఆశాదీపం అంటూ అంతా పృథ్వీ షాను ఆకాశానికి ఎత్తేశారు. దేశవాళీ క్రికెట్లో పెను సంచలనాలు నమోదు చేసి భారత జట్టులోకి దూసుకొచ్చిన ఈ యువ సంచలనం... అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాడు. ఆకాశం నుంచి ఒక్కసారిగా పాతాళానికి పడిపోయాడు. ఎంత స్పీడ్‌గా టీమిండియాలోకి దూసుకొచ్చాడో... అంతే స్పీడ్‌గా కనుమరుగైయ్యాడు. వివాదాలతో వార్తల్లో నిలిచినా.. బ్యాట్‌తో టీమిండియాలో నిల్చోలేకపోయాడు. బ్యాడ్ బాయ్‌గా పేరుతెచ్చుకున్న ఈ యంగ్ క్రికెటర్... తాజాగా తాను తప్పు చేశానంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీతో.. వావ్ ఇండియాకు మరో సచిన్ దొరికేశాడంటూ ప్రశంసలు అందుకున్నా... ఆ తర్వాత ఐదు టెస్టులు, ఆరు వన్డేలు ఆడి.. టీమిండియాకు దూరం అయ్యాడు. ఐపీఎల్లో అదరగొడుతున్నా.. కొన్నేళ్లుగా అక్కడ కూడా ఫెయిల్ అయ్యాడు. కేవలం 25 ఏళ్ల వయసులో.. ఐపీఎల్ 2025 కంటే ముందు జరిగిన మెగా వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. దీంతో మనోడికి దిమ్మతిరిగి.. జ్ఞానం దయం.
షా ఏమన్నాడంటే...?
తన స్నేహితుల్లోని కొందరి వల్ల తన కెరీర్ నాశనమైందని పృథ్వీ షా తెలిపాడు. తన స్వయంకృపరాధంతోనే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని చెప్పాడు. రెండేళ్లుగా తాను క్రికెట్‌కు ఎక్కువ టైమ్ ఇవ్వలేదని తన తప్పిదాన్ని పృథ్వీ షా అంగీకరించాడు. పేలవ ఫామ్, ఫిట్నెస్ సమస్యలతో ప్రొఫెషనల్ క్రికెట్‌కు దూరమైన పృథ్వీ షా.. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో అన్‌సోల్డ్‌గా నిలిచాడు. 25 ఏళ్లకే పొట్ట, బట్ట తలతో అంకుల్లా మారిన పృథ్వీ షాను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపలేదు. అతడి క్రికెట్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారిన వేళ ఓ క్రీడా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు. తప్పుడు వ్యక్తులతో తాను స్నేహం చేశానని అన్నాడు.
ఈ సందర్భంగా కెరీర్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆటపై దృష్టిపెట్టకపోవడానికి గల కారణాలను పంచుకున్నాడు. ‘‘జీవితంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా. నేను క్రికెట్‌కు తక్కువ సమయం కేటాయిస్తున్నానని అర్థమైంది. 2023 వరకు నేను రోజులో సగం సమయం గ్రౌండ్‌లోనే గడిపేవాడిని. కానీ, ఆ తర్వాత నుంచి కొన్ని చెత్త విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వడం మొదలుపెట్టా. కొంతమంది తప్పుడు వ్యక్తులతో స్నేహం చేశా. మనం టాప్‌లో ఉన్న సమయంలో చాలామంది స్నేహితులు మన దగ్గరకు చేరుతారు. నాదీ అదే పరిస్థితి. దీంతో నేను ట్రాక్ తప్పా. మైదానానికి వెళ్లే సమయాన్ని 8 గంటల నుంచి 4 గంటలకు తగ్గించా’’ అని పృథ్వీ షా తన ఆవేదనను పంచుకున్నాడు. తన తాతయ్య మరణం తర్వాత జీవితంలో చాలా సంఘటనలు చోటుచేసుకున్నాయని ఈ యువ ఆటగాడు తెలిపాడు. ‘‘నాకు కుటుంబ సమస్యలు ఉన్నాయి. మా తాతయ్య చనిపోయారు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన మరణంతో కుంగిపోయా. ఆ తర్వాత చాలా జరిగాయి. అవన్నీ నేను చెప్పలేను. నా తప్పులను అంగీకరించాను కూడా. ఆ సమయంలో మా నాన్న నాకు అండగా నిలిచారు. నాకు ధైర్యాన్ని ఇచ్చారు’’ అని పృథ్వీ షా వివరించాడు.
కమ్ బ్యాక్పైనే దృష్టి
ఇప్పుడు పృథ్వీ షా ఫోకస్ మొత్తం తన ప్రాక్టీస్ మీదే పెట్టినట్లు సమాచారం. ఐపీఎల్లో అన్‌సోల్డ్‌గా మిగలడం, డొమెస్టిక్ క్రికెట్లో కూడా సరిగ్గా రాణించకపోవడంతో తన క్రికెట్ కెరీర్‌కు పుల్‌స్టాప్ పడే ప్రమాదం ఉందని గ్రహించిన షా.. తన కమ్‌బ్యాక్‌పై దృష్టి పెట్టాడు.