IND PAK: భారత్ పాక్ మ్యాచ్ అమ్ముడుపోని టికెట్లు
మరీ అంత ధరలా అంటూ ఫ్యాన్స్ ఫైర్
చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఈ రెండు జట్లు తొలిసారిగా తలపడనుండడంతో.. డిమాండ్ భారీగా ఉంటుందని అంచనా వేశారు. కానీ, ఆసియాక్‌పలో ఆదివారం జరిగే ఇండో-పాక్ మ్యాచ్ టికెట్లు ఇంకా అందుబాటులో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హైవోల్టేజ్ మ్యాచ్‌కు డిమాండ్ తగ్గడానికి అధిక ధరలే కారణమని తెలుస్తోంది. రెండు సీట్లకు రూ. 10,000 అన్నింటికంటే తక్కువ. వీఐపీ రాయల్ బాక్స్‌లో జతకు రూ. 2,30,700, స్కైబాక్స్ టికెట్ రూ. 1,67,851గా నిర్ణయించారు. ప్లాటినం రూ. 75,658, గ్రాండ్ లాంజ్ రూ. 41,153 లాంటి మధ్య శ్రేణి టికెట్లు కూడా సగటు ప్రేక్షకుడికి అందుబాటులో లేవు.
అభిమానుల ఆగ్రహం
సాధారణంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లు కొన్ని గంటల్లోనే అమ్ముడుపోతాయి. కానీ, ఈసారి పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. టికెట్ల ధరలు ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. చాలా మంది అభిమానులు సోషల్ మీడియాలో తమ కోపాన్ని వ్యక్తం చేస్తూ, నిర్వాహకులు ధరలు పెంచడం వల్ల సాధారణ క్రికెట్ అభిమానులు స్టేడియానికి వెళ్లి మ్యాచ్ చూడలేకపోతున్నారని ఆరోపిస్తున్నారు. ఏదేమైనా దాయాదుల మధ్య పోరును ఎన్ క్యాష్ చేసుకుందామని భావించిన నిర్వాహకులకు తాజా పరిణామం గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లుగా మారిందని విమర్శకులు చురకలు అంటిస్తున్నారు. ఇక ఆసియాకప్ లో భారత్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. యూఏఈని 57 పరుగులకే పరిమితం చేసి భారీ విజయం సాధించింది.