IND vs AUS: శతక్కొటిన రో"హిట్"..చెలరేగిన విరాట్
నామమాత్రపు వన్డేలో టీమిండియా విజయం... సెంచరీతో సత్తా చాటిన రోహిత్ శర్మ... క్లాస్ ఇన్నింగ్స్ తో మెరిసిన విరాట్ కోహ్లీ
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆతిథ్య ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో అదరగొట్టారు. రోహిత్ శర్మ తన కెరీర్లో 50వ అంతర్జాతీయ సెంచరీ సాధించాడు. విరాట్ కోహ్లీ.. మరో వన్డే హాఫ్ సెంచరీ కొట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 236 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్.. మరో 11.3 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ గడ్డపై విరాట్ కోహ్లీ, రోహిత్ చివరి ఆట చూసేందుకు ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్ మైదానం కిటకిటలాడిపోయింది. ఇంతటి అభిమానాన్ని ఆ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు కూడా ఏమాత్రం వమ్ము చేయలేదు. ఆసీస్ బౌలర్లపై ఆధిపత్యంతో రోహిత్ తన వింటేజ్ ఆటతీరును ప్రదర్శించగా, ఇక రెండు వరుస డకౌట్ల నుంచి తేరుకున్న విరాట్ క్లాస్ ఇన్నింగ్స్‌తో మైమరిపించాడు. అజేయంగా నిలిచిన ఈ ఇద్దరు భారత్‌ను వైట్‌వాష్ ముప్పు నుంచి తప్పించడంతో పాటు విమర్శకుల నోళ్లు మూయించారు.
ఆసిస్ తక్కువ పరుగులకే...
భారత బౌలర్ల దెబ్బకు 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. భాగస్వామ్యాలు నిర్మించడానికి ఇబ్బందిపడింది. మార్ష్‌ను అక్షర్ బౌల్డ్ చేయడం, షార్ట్ (30)ను సుందర్ వెనక్కి పంపడంతో ఆసీస్ 124/3తో నిలిచింది. ఆ దశలో రెన్షా నిలిచాడు. అతడు కేరీ (24)తో కలిసి స్కోరు బోర్డును నడిపించడంతో ఓ దశలో ఆసీస్ 183/3తో మెరుగ్గానే కనిపించింది. కానీ హర్షిత్ రాణా అద్భుత బౌలింగ్‌తో ఆ జట్టు వెన్నువిరిచాడు. మంచి పేస్, బౌన్స్ రాబట్టిన అతడు.. చకచకా వికెట్లు పడగొట్టాడు. స్టార్క్‌ను కుల్దీప్ వెనక్కి పంపగా.. ఎలిస్‌ను ప్రసిద్ధ్ ఔట్ చేశాడు. కనోలి (23), హేజిల్‌వుడ్ (0)లను రాణా ఒకే ఓవర్లో ఔట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
రో-కో షో
237 పరుగుల ఛేదనలో ఓపెనర్ రోహిత్, విరాట్ కళ్లుచెదిరే ఆటతీరుతో ప్రేక్షకులను అలరించారు. వీరి ప్రతీ పరుగును వారంతా ఆస్వాదించారు. మరో ఓపెనర్ గిల్ (24)తో రోహిత్ తొలి వికెట్‌కు 69 రన్స్ అందించాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన పేసర్ హాజెల్‌వుడ్ 11వ ఓవర్లో గిల్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత ఆసీస్ బౌలర్లకు రో-కో చుక్కలు చూపించారు. ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య క్రీజులోకి వచ్చిన విరాట్ తొలి సింగిల్ తీయగానే స్టేడియం మార్మోగిపోయింది. రెండు వరుస డకౌట్ల తర్వాత వచ్చిన పరుగు కావడంతో కోహ్లీ కూడా సరదాగా పిడికిలి బిగించి చూపాడు. కోహ్లీ స్టార్క్ బౌలింగ్‌లో తన ట్రేడ్‌మార్క్ స్ట్రెయిట్ డ్రైవ్‌తో తొలి బౌండరీ సాధించాడు. 63 బంతుల్లో అర్ధశతకం సాధించిన రోహిత్.. మరో 42 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. కోహ్లి గట్టిగా హత్తుకుని అభినందించాడు. కోహ్లి 56 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. 33వ ఓవర్లో రోహిత్ శతకంతోపాటు టీమ్ఇండియా 200 కూడా పూర్తయింది. అప్పటికే భారత్ విజయం ఖాయమైపోయింది. 105 బంతుల్లో రోహిత్ కెరీర్లో 33వ శతకాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత షార్ట్ ఓవర్లో రోహిత్ 6,4తో.. 39వ ఓవర్లో విరాట్ ఫోర్‌తో 69 బంతులుండగానే మ్యాచ్ ముగిసింది.