IND vs BAN: భారత్-బంగ్లా మ్యాచ్ వర్షార్పణం
ఎడతెరపిలేని వర్షంతో భారత్ చివరి మ్యాచ్ రద్దు
భారత్, బంగ్లాదేశ్ మధ్య మహిళల వన్డే ప్రపంచకప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అయితే ఆదివారం భారత జట్టు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మ్యాచ్ సాగి ఉంటే అలవోకగా గెలిచేదే. మొదట బంతితో బంగ్లాను భారత్ దెబ్బతీసింది. వర్షం వల్ల ఇన్నింగ్స్‌ను 27 ఓవర్లకు కుదించగా.. స్పిన్నర్లు రాధ యాదవ్ (3/30), శ్రీచరణి (2/23) ధాటికి బంగ్లా 9 వికెట్లకు 119 పరుగులే చేయగలిగింది. రేణుక, దీప్తి, అమన్‌జ్యోత్ తలో వికెట్ పడగొట్టారు. షర్మిన్ అక్తర్ (36) బంగ్లా టాప్ స్కోరర్. డక్‌వర్త్ లూయిస్ విధానంలో లక్ష్యాన్ని 126 పరుగులకు సవరించగా.. వర్షంతో ఆట నిలిచిపోయే సమయానికి భారత్ 8.4 ఓవర్లలో 57 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (34 నాటౌట్; 27 బంతుల్లో 6×4), అమన్‌జ్యోత్ కౌర్ (15 నాటౌట్; 25 బంతుల్లో 2×4) రాణించారు. షర్మిన్, శోభన మోస్తరీ (26) నాలుగో వికెట్‌కు 38 పరుగులు జోడించారు. కానీ వేగంగా పరుగులు చేయలేకపోయారు. రాధ యాదవ్, శ్రీచరణి విజృంభించడంతో బంగ్లా 28 పరుగుల వ్యవధిలో చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. ఛేదనలో ఓపెనర్ స్మృతి మంధాన చెలరేగడంతో భారత్ వడివడిగా లక్ష్యం దిశగా సాగింది. అమన్‌జ్యోత్ కౌర్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన స్మృతి అలరించింది.
అక్టోబర్ 30న రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా- టీమిండియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. నవంబర్ 2న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ప్రస్తుతం మహిళల వన్డే ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (13 పాయింట్లు), దక్షిణాఫ్రికా (10 పాయింట్లు), ఇంగ్లాండ్ (9 పాయింట్లు), భారత్ (6 పాయింట్లు) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ జట్లన్నీ సెమీస్ అర్హత సాధించాయి. ఆదివారం టీమిండియా తన చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది.