IND vs ENG: ఓవల్ టెస్టులో రసవత్తర పోరు

భారత్-ఇంగ్లాండ్ హోరాహోరీ.. తొలి ఇన్నింగ్స్ లో 224 రన్స్‌కు భారత్ ఆలౌట్... 247 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లాండ్;

Update: 2025-08-02 02:30 GMT

ఇంగ్లాండ్ తో జరుగుతున్న అయిదో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. అయిదో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 247 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్ కు 23 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 2 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్ దూకుడైన బ్యాటింగ్ తో చెలరేగాడు. కేఎల్ రాహుల్ త్వరగానే అవుటైనా జైస్వాల్ మాత్రం టీ 20 తరహా ఆటతీరుతో దూకుడుగా ఆడాడు. బజ్ బాల్ ఆటతీరుతో బ్రిటీష్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. జైస్వాల్ కేవలం 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. రాహుల్ 7, సాయి సుదర్శన్ 11 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరారు. మరో వికెట్ పడకుండా భారత బ్యాటర్లు సమర్థంగా అడ్డుకున్నారు.

కరుణ్ నాయర్ ఒక్కడే...

ఈ మ్యాచులో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌటైంది. తొలి రోజు 204/6 పరుగులు చేసిన భారత జట్టు రెండో రోజు కేవలం 20 పరుగులకే మరో నాలుగు వికెట్లు కోల్పోయింది. టీమ్‌ఇండియా బ్యాటర్లలో కరుణ్‌ నాయర్‌ (57) టాప్‌ స్కోరర్‌. మిగతా బ్యాటర్లంతా తక్కువ పరుగులకే వెనుదిరిగారు. యశస్వి జైస్వాల్‌ (2), కేఎల్‌ రాహుల్‌ (14), రవీంద్ర జడేజా (9), ధ్రువ్‌ జురేల్‌ (19) బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. సాయిసుదర్శన్‌ (38), శుభ్‌మన్‌ గిల్‌ (21), వాషింగ్టన్‌ సుందర్ (26) ఫర్వాలేదనిపించారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ 26, ధృవ్ జురేల్ 19 పరుగులు చేశారు. దీంతో భారత జట్టు మొత్తం 69.4 ఓవర్లలో 224 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో గస్‌ అట్కిన్సన్ 5 వికెట్లు పడగొట్టాడు. జోష్‌ టంగ్‌ 3, క్రిస్‌ వోక్స్‌ 1 వికెట్‌ తీసుకున్నారు.

ఇంగ్లాండ్ కు స్వల్ప ఆధిక్యం

అనంతరం తొలి ఇన్నింగ్స్ లో 247 పరుగులు చేసింది. దీంతో ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ 23 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్ 51.2 ఓవర్లలో 247 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఇక ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ (64), బెన్ డకెట్ (43) బజ్‌బాల్ స్టైల్లో వేగంగా పరుగులు సాధించి భారత్‌పై ఒత్తిడి పెంచారు. ఆ తర్వాత కెప్టెన్ ఒలీ పోప్ (22), జో రూట్ (29) మిడిలార్డర్‌లో నిలదొక్కుకోగా.. చివరగా హ్యారీ బ్రుక్ 53 పరుగులతో అద్భుతంగా ఆడాడు. పోప్, రూట్, బెతేల్ ముగ్గురూ కూడా సిరాజ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔటవ్వడం విశేషం. టీ విరామానికి ముందు ప్రసిద్ కృష్ణ ఇంగ్లాండ్ కు ఊహించని షాక్ ఇచ్చాడు. ఒకే ఓవర్లో జెమీ స్మిత్ (8) తో పాటు జెమీ ఓవర్దన్ (0) వికెట్లను తీశాడు. ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీ (64) తొలి వికెట్ కు 92 పరుగులు జోడించి సూపర్ స్టార్ట్ ఇచ్చారు. వేగంగా ఆడుతున్న డకెట్ (43) ను ఆకాష్ దీప్ ఔట్ చేసి టీమిండియాకు తొలి వికెట్ అందించాడు. లంచ్ తర్వాత హాఫ్ సెంచరీ చేసిన క్రాలీని ప్రసిద్ పెవిలియన్ కు చేర్చాడు. ఆ తర్వాత సిరాజ్ ఇంగ్లాండ్ బ్యాటర్లను వణికించాడు. తన పదునైన బంతులతో పోప్ (22), రూట్ (29), బెతేల్ (6) ను స్వల్ప వ్యవధిలో ఔట్ చేసి ఇంగ్లాండ్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఇక భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు చెరో 4 వికెట్లు, ఆకాశ్ దీప్ ఒక వికెట్ సాధించారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 247 పరుగులకు ఆలౌట్ అవడంతో భారత్‌పై 23 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇంగ్లండ్ ప్లేయర్ క్రిస్ వోక్స్ గాయం కారణంగా బ్యాటింగ్‌కు రాలేదు.

Tags:    

Similar News