GAMBHIR: అలా చేస్తే ఫలితం మరోలా ఉండేది : గంభీర్
తొలి టెస్టు ఓటమిపై టీమిండియా హెచ్ కోచ్ రియాక్షన్... ఏ ఒక్కరినీ బాధ్యులను చేయలేమన్న కోచ్;
ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ ఓటమికి ఏ ఒక్కరినీ బాధ్యులను చేయలేమని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. ఇది జట్టు సమిష్టి వైఫల్యమని, ఏ ఒకరి వల్లో ఈ పరాజయం ఎదురుకాలేదని స్పష్టం చేశాడు. ఓటమి గెలుపులను జట్టుగానే తీసుకుంటామని చెప్పాడు. ‘తొలి ఇన్నింగ్స్‌లో 570 నుంచి 580 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఈ మ్యాచ్ ఓటమికి ఏ ఒక్క ఆటగాడిని లేదా జట్టును నిందించలేను. మేం కలిసి గెలుస్తాం. ఓటమిని కూడా ఒక్కటిగానే స్వీకరిస్తాం. భారత బౌలింగ్ విభాగంలో అనుభవ లేమి కనిపించింది. సిరాజ్, బుమ్రా మినహా మిగతా బౌలర్లకు టెస్ట్ క్రికెట్ ఆడిన అనుభవం లేదు. ఒకరు మూడు, మరొకరు ఐదు మ్యాచ్‌లు ఆడితే.. ఇంకొకరు అరంగేట్రమే చేయలేదు. 2022లో జట్టులో 40 మ్యాచ్‌లు ఆడిన అనుభవం కలిగిన పేసర్లు ఉన్నారు. కాబట్టి వారు 20 వికెట్లు తీసేవారు. ప్రస్తుత బౌలింగ్ విభాగానికి అంత అనుభవం లేదు. వారికి తగిన సమయం ఇవ్వాలి. ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ వంటి బౌలర్లు భవిష్యత్తులో రాణించడానికి తగిన మద్దతు అందించాలి. కేవలం ఒక టెస్ట్ ఆధారంగా వారి ఆట తీరును అంచనా వేయడం సరికాదు.’ అని గంభీర్ పేర్కొన్నాడు.
గిల్‌కు సమయమివ్వాలి..
కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు ఇది తొలి టెస్టు అని, అతనికి కాస్త సమయం ఇవ్వాలని గంభీర్ అభిప్రాయపడ్డాడు. టీమ్‌ను లీడ్ చేసే అన్ని లక్షణాలు గిల్‌కు ఉన్నాయని చెప్పాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే గిల్ సెంచరీ సాధించాడని గుర్తుచేశాడు. ఇక, లోయరార్డర్ వైఫల్యం నిరాశకు గురిచేసిందన్నాడు. ‘యశస్వి జైస్వాల్ వంటి అత్యుత్తమ ఆటగాళ్లు క్యాచ్‌లు వదిలేయడం సరికాదు. అయితే, ఏ ఆటగాడు ఉద్దేశపూర్వకంగా అలా చేయడు. వరల్డ్ బెస్ట్ ఆటగాళ్లు కూడా క్యాచ్‌లు వదిలేస్తారు. శార్దూల్ ఠాకూర్‌ను బౌలింగ్ ఆల్‌రౌండర్‌గానే జట్టులోకి తీసుకున్నాం. కానీ రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో కెప్టెన్ సహజంగానే తక్కువ ఓవర్లు ఇచ్చి ఉండొచ్చు. రెండో ఇన్నింగ్స్‌లో శార్దూల్ కీలకమైన రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌లో జస్‌ప్రీత్ బుమ్రా మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడతాడు. అతను ఆడే తదుపరి రెండు మ్యాచ్‌లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అతని వర్క్‌లోడ్‌ను పరిశీలించాల్సి ఉంది. జైస్వాల్, గిల్, రాహుల్ సెంచరీలు చేయడంతోపాటు రిషభ్ రెండు సెంచరీలు చేశాడు. నిజానికి 5 టెస్టుల సిరీస్‌లో భారత్‌కు ఇది అద్భుత ఆరంభం.'అని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు.