IND vs NZ: కోహ్లీ శతకం వృథా.. సిరీస్ కివీస్ కైవసం
మూడో వన్డేలో న్యూజిలాండ్ గెలుపు... 41 పరుగుల తేడాతో ఇండియా ఓటమి... చివరి వరకూ పోరాడిన విరాట్ కోహ్లీ
భారత్ – న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్ అభిమానులకు ఉత్కంఠభరితమైన అనుభవాన్ని ఇచ్చింది. నిర్ణయాత్మక మూడో వన్డేలో న్యూజిలాండ్ జట్టు 41 పరుగుల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో కివీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో తమ ఖాతాలో వేసుకున్నారు. చివరి మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు తీవ్రంగా పోరాడినప్పటికీ, లక్ష్యాన్ని అందుకోలేక ఓటమి పాలయ్యారు. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసి భారీ స్కోర్ నమోదు చేసింది. కివీస్ ఇన్నింగ్స్‌కు డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ శతకాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. డారిల్ మిచెల్ 131 బంతుల్లో 137 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టగా, గ్లెన్ ఫిలిప్స్ వేగంగా ఆడి 88 బంతుల్లో 106 పరుగులు సాధించాడు. వీరిద్దరూ కలిసి భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. విల్ యంగ్ 30 పరుగులు చేయగా, చివర్లో మైఖేల్ బ్రాస్‌వెల్ అజేయంగా 28 పరుగులు చేసి జట్టుకు మరింత బలం చేకూర్చాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా మంచి ప్రదర్శన కనబరిచి చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
338 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరగా, రోహిత్ శర్మ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కూడా విఫలమవ్వడంతో భారత్ ఒత్తిడిలోకి వెళ్లింది. ఈ పరిస్థితుల్లో కోహ్లీ భారత ఇన్నింగ్స్‌కు అండగా నిలిచాడు. కోహ్లీ 108 బంతుల్లో 124 పరుగులు చేసి అభిమానులను అలరించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. కోహ్లీతో పాటు యువ ఆటగాడు నితీశ్ రెడ్డి అద్భుతంగా పోరాడి 57 బంతుల్లో 53 పరుగులు చేశాడు. చివరి దశలో హర్షిత్ రాణా కూడా అనూహ్యంగా బ్యాట్‌తో మెరిసి 43 బంతుల్లో 52 పరుగులు చేయడం విశేషం.
రన్‌రేట్ పెరిగిపోవడంతో ...
అయితే అవసరమైన రన్‌రేట్ పెరిగిపోవడంతో భారత్ లక్ష్యాన్ని చేధించలేకపోయింది. చివరకు భారత జట్టు 296 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్, జాక్ ఫౌక్స్ చెరో మూడు వికెట్లు తీసుకుని భారత్ ఆశలపై నీళ్లు చల్లారు. లెనాక్స్ రెండు వికెట్లు తీయగా, కైల్ జేమీసన్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ ఓటమితో భారత్ సిరీస్‌ను చేజార్చుకోగా, న్యూజిలాండ్ జట్టు సమిష్టి ప్రదర్శనతో సిరీస్ విజేతగా నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ కివీస్ ఆటగాళ్లు సమతూకంతో ఆడటం ఈ విజయానికి ప్రధాన కారణంగా మారింది. భారత్‌కు ఈ సిరీస్ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, భవిష్యత్ మ్యాచ్‌లకు మరింత బలంగా సిద్ధమవాల్సిన అవసరం ఉంది.