T20 WORLD CUP: టీమిండియా జగజ్జేత
ఫైనల్లో ఏకపక్ష విజయం.. ప్రపంచ క్రికెట్లో మళ్లీ భారత్ ఆధిపత్యం
టీమిండియా అద్భుతమైన ఆటతీరుతో మరోసారి ప్రపంచ క్రికెట్‌పై తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రారంభంలో కొంత తడబాటు కనిపించినా, అసలు సమయం వచ్చినప్పుడు అసాధారణంగా పుంజుకుని ప్రత్యర్థులను చిత్తుగా ఓడిస్తూ టీ20 ప్రపంచకప్‌ను ఘనంగా కైవసం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమన్వయంతో ఆడిన భారత జట్టు అభిమానులకు మరిచిపోలేని విజయాన్ని అందించింది. కీలక మ్యాచ్‌లలో అసాధారణ ప్రదర్శన చేస్తూ, ఒత్తిడిని జయించి, అద్భుతమైన పోరాటస్ఫూర్తితో కప్పును ముద్దాడింది. కోట్లాది భారత అభిమానుల హృదయాల్లో ఆనందాన్ని నింపిన ఈ విజయం భారత క్రికెట్ చరిత్రలో మరో చిరస్మరణీయ అధ్యాయంగా నిలిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో టీమిండియా పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు సాధించింది. స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ కివీస్ బౌలర్లపై ధాటిగా విరుచుకుపడ్డాడు. అతని దూకుడైన బ్యాటింగ్‌తో స్కోరు వేగంగా పెరిగింది. అతనికి తోడుగా ఇతర బ్యాటర్లు కూడా కీలక పరుగులు జోడించడంతో భారత్ భారీ లక్ష్యాన్ని నిలబెట్టగలిగింది.
లక్ష్యచేదనకు దిగిన న్యూజిలాండ్‌కు భారత బౌలర్లు ప్రారంభం నుంచే కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఒత్తిడి తీసుకొచ్చారు. ముఖ్యంగా అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ కివీస్ బ్యాటర్లకు చెక్ పెట్టారు. వరుసగా వికెట్లు తీస్తూ మ్యాచ్‌ను పూర్తిగా భారత వైపు తిప్పేశారు. మధ్య మధ్యలో న్యూజిలాండ్ బ్యాటర్లు పోరాడేందుకు ప్రయత్నించినా భారత బౌలింగ్ దాడికి ఎదురులేకపోయారు. చివరికి న్యూజిలాండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా మూడోసారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్‌గా కప్పును నిలబెట్టుకున్న తొలి జట్టుగా నిలవడం మరింత ప్రత్యేకంగా నిలిచింది. సొంత ప్రేక్షకుల మధ్య కప్పును అందుకుంది.