IND vs PAK: ‌భారత్‌కు శివరాత్రి..పాక్‌కు కాళరాత్రి

ఇషాన్ తుఫానులో గల్లంతైన పాకిస్థాన్

Update: 2026-02-16 01:30 GMT

ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్ అంటే కేవలం ఒక క్రికెట్ పోరు కాదు… భావోద్వేగాల తుఫాన్. స్టేడియంలో అడుగుపెట్టిన క్షణం నుంచి చివరి బంతి పడే వరకు ప్రతి క్షణం ఉత్కంఠతో నిండిపోతుంది. అలాంటి హై-వోల్టేజ్ సమరంలో మరోసారి చరిత్ర పునరావృతమైంది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చాటిన భారత జట్టు పాక్‌ను చిత్తుచేసి టోర్నీలో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్ ప్రారంభం నుంచే ఆసక్తికరంగా సాగింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకోగా, భారత్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. పిచ్ మందకొడిగా ఉండటం, బంతి తిరుగుతుండటం వల్ల ప్రారంభంలో భారత బ్యాటర్లకు కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి. ఓపెనర్ అభిషేక్ ఖాతా కూడా తెరవకుండానే ఔట్ కావడం భారత అభిమానులను కాస్త ఆందోళనకు గురిచేసింది. సల్మాన్ ఆఘా అతణ్ని వెనక్కి పంపాడు. అనంతరం వచ్చిన తిలక్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.

ఇషాన్ తుఫాన్

ఇషాన్ కిషన్ మాత్రం తనదైన స్టైల్‌లో ఆడుతూ మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా అతడు వెనక్కి తగ్గలేదు. షహీన్ అఫ్రిది బౌలింగ్‌లో సిక్స్, ఫోర్‌తో ధాటిగా ఆరంభించిన ఇషాన్, స్పిన్నర్లను కూడా ఏ మాత్రం వదల్లేదు. ఆఘా, సయిమ్, అబ్రార్, షాదాబ్—ఎవరైనా సరే బంతి బౌండరీ దాటించడమే లక్ష్యంగా బ్యాట్ ఊపాడు. కేవలం 27 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసి పాక్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. చివరికి 40 బంతుల్లో 77 పరుగులు (10 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. పరిస్థితులకు సంబంధం లేకుండా అతడు బ్యాట్‌ ఝళిపించాడు. బంతి బాగా టర్నవుతున్నా అతడు తనవైన షాట్లు ఆడడానికి వెనుకాడలేదు. షహీన్‌ అఫ్రిది బౌలింగ్‌లో సిక్స్, ఫోర్‌ కొట్టిన అతడు.. ఆఘా ఓవర్లో ఫోర్, సయిమ్‌ ఓవర్లో ఫోర్, అబ్రార్‌ ఓవర్లో 6, 4తో విరుచుకుపడ్డాడు. అబ్రార్‌ మరో ఓవర్లో వరుసగా రెండు బంతులను బౌండరీ దాటించి అర్ధశతకం (27 బంతుల్లో) పూర్తి చేశాడు ఇషాన్‌. షాదాబ్‌నూ అతడు వదల్లేదు. ఇషాన్‌ కిషన్‌ (77; 40 బంతుల్లో 10×4, 3×6) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో భారత్‌ మొదట 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.

చేతులెత్తేసిన పాక్

176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఆరంభం నుంచే ఒత్తిడికి లోనైంది. భారత పేసర్లు అద్భుత ప్రదర్శనతో పాక్ టాప్ ఆర్డర్‌ను కుదిపేశారు. హార్దిక్ తొలి ఓవర్లోనే ఫర్హాన్‌ను ఔట్ చేయగా, బుమ్రా తన తదుపరి ఓవర్లో సయిమ్, సల్మాన్ ఆఘాలను వెనక్కి పంపి మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పాడు. మొదటి పది నిమిషాల్లోనే పాకిస్థాన్ జట్టు సంక్షోభంలో పడిపోయింది. స్పిన్‌కు అనుకూలంగా మారిన పిచ్‌పై భారత బౌలర్లు క్రమంగా కట్టుదిట్టమైన లైన్లు, లెంగ్త్‌లతో బౌలింగ్ చేశారు. పాక్ బ్యాటర్లు ఏ దశలోనూ స్థిరపడలేకపోయారు. వికెట్లు క్రమం తప్పకుండా పడుతూ రావడంతో మ్యాచ్‌లో పోటీ అనే మాటే కనిపించలేదు. కీపర్ ఉస్మాన్ ఖాన్ చేసిన 44 పరుగులే ఆ జట్టుకు గరిష్ట స్కోరు. మిగతా బ్యాటర్లలో సగానికి పైగా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. చివర్లో షహీన్ అఫ్రిది 19 బంతుల్లో 23 పరుగులతో కొంత పోరాడినా, ఫలితాన్ని మార్చే స్థాయిలో ఆ ఇన్నింగ్స్ ఉపయోగపడలేదు. చివరకు పాకిస్థాన్ జట్టు 18 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Tags:    

Similar News