IND vs PAK: భారత్ వర్సెస్ పాక్? ఈసారి జరుగుతుందా..?
WCL 2025 సెమీస్‌కు భారత్... పాయింట్ల పట్టికలో టాప్‌లో పాక్... భారత్-పాక్ తలపడే అవకాశం;
వరల్డ్ ఛాంపియన్షిప్ లెజెండ్స్ 2025లో ఇండియా ఛాంపియన్స్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. వెస్టిండీస్‌తో మంగళవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా ఛాంపియన్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ టోర్నీలో భారత్ సాధించిన ఏకైక విజయం ఇదే కావడం గమనార్హం. ఒకే ఒక్క విజయం సాధించినా మెరుగైన రన్‌రేట్ కారణంగా భారత్ సెమీస్‌కు అర్హత సాధించింది.
పోలార్ట్ విధ్వంసం
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులు చేసింది. కీరన్ పోలార్డ్(43 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 74) ఒక్కడే రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో పియూష్ చావ్లా (3/18) మూడు వికెట్లు తీయగా.. వరుణ్ ఆరోన్(2/40), స్టువర్ట్ బిన్నీ(2/17) రెండేసి వికెట్లు పడగొట్టారు. పవన్ నేగికి ఓ వికెట్ దక్కింది.
బిన్నీ, యువీ ధనాధన్
టీమిండియా సెమీస్ చేరాలంటే 14.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ భారత్ 13.2 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసి గెలుపొందింది. స్టువర్ట్ బిన్నీ(21 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 నాటౌట్) హఫ్ సెంచరీతో చెలరేగగా.. యువరాజ్ సింగ్(11 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 21), యూసఫ్ పఠాన్(7 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 21 నాటౌట్) మెరుపులు మెరిపించారు. విండీస్ బౌలర్లలో డ్వేన్ స్మిత్(2/27), డ్వేన్ బ్రావో(2/47) రెండేసి వికెట్లు పడగొట్టారు.
టాప్‌లో పాక్
ఈ టోర్నీ లీగ్ దశలో 5 మ్యాచ్‌లు ఆడిన భారత్ ఒకే ఒక్క విజయం సాధించింది. కానీ మెరుగైన రన్‌రేట్‌తో సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు బరిలోకి దిగగా.. నాలుగేసి విజయాలతో పాకిస్థాన్, సౌతాఫ్రికా ఛాంపియన్స్ జట్లు టాప్-2లో నిలిచాయి. రెండు విజయాలతో ఆస్ట్రేలియా ఛాంపియన్స్ మూడో స్థానంలో నిలవగా.. ఇండియా ఛాంపియన్స్ మెరుగైన రన్‌రేట్‌తో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఇంగ్లండ్, వెస్టిండీస్ ఒక్కో విజయం సాధించినా.. తక్కువ రన్ రేట్ కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
పాక్‌తో భారత్?
టోర్నీ రూల్స్ ప్రకారం అగ్రస్థానంలో నిలిచిన జట్టు.. నాలుగో స్థానంలో నిలిచిన టీమ్‌తో సెమీఫైనల్ ఆడాలి. దాంతో పాక్‌తో భారత్ సెమీస్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే లీగ్ దశలో పాకిస్థాన్‌తో ఆడేందుకు ఇండియా ఛాంపియన్స్ నిరాకరించింది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ఘటనల నేపథ్యంలో పాకిస్థాన్‌తో ఆడలేమని ఆటగాళ్లు చెప్పారు. దాంతో ఈ మ్యాచ్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. సెమీస్‌లో మరోసారి ఈ రెండు జట్లు తలపడాల్సిన పరిస్థితి తలెత్తడంతో ఇప్పుడు ఏం చేస్తారనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ మ్యాచ్ గురువారం జరగనుంది. తొలి మ్యాచ్ తరహాలోనే ఈ సెమీస్‌ను భారత్ బాయ్‌కాట్ చేస్తే పాకిస్థాన్ ఫైనల్ చేరనుంది. మరోవైపు శిఖర్ ధావన్ మాత్రం పాకిస్థాన్‌తో ఎట్టి పరిస్థితుల్లో ఆడేది లేదని మీడియాతో అన్నాడు. ఈ పరిస్థితుల్లో నిర్వాహకులు సెమీస్ పోరును మారుస్తారా? లేక పాకిస్థాన్‌ను ఫైనల్ చేర్చుతారా? అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఇండియా ఆడటానికి నిరాకరిస్తే, నిబంధనల ప్రకారం పాకిస్తాన్‌కు నేరుగా ఫైనల్ టికెట్ లభిస్తుంది.