IND vs SA: టీమిండియా పుంజుకుంటుందా?
మూడో టీ20కు టీమిండియా సిద్ధం... ఆత్మ విశ్వాసంతో ఉన్న దక్షిణాఫ్రికా... ఆధిక్యంపై కన్నేసిన ఇరు జట్లు
తొలి టీ20 భారత్ గెలిచింది. రెండో టీ20 సౌతాఫ్రికా నెగ్గింది. ఐదు టీ20ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1 సమవుజ్జీలుగా ఉన్నాయి. నేడు ధర్మశాల వేదికగా మూడో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి లీడ్‌లోకి వెళ్లాలని టీమిండియా పట్టుదలతో ఉంది. గత మ్యాచ్‌లో భారత జట్టు ప్రదర్శన ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదు. ముందుగా బంతితో.. ఆ తర్వాత బ్యాటుతో చేతులెత్తేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఓటమి కంటే భారత ప్లేయర్ల ఆడిన తీరు కాస్త ఆందోళనకరంగానే ఉంది. కాబట్టి, మూడో టీ20లో భారత జట్టు లోపాలను సరిదిద్దుకుని మెరుగుపడాల్సిన అవసరం ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ల ఫామే భారత్‌కు అతి పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా గిల్ ఈ సిరీస్‌లో అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతే జట్టులో చోటు గల్లంతవడం ఖాయం. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న జట్టు యాజమాన్యం.. ఈ మ్యాచ్‌లో ఎవరిని ఏ స్థానంలో ఆడిస్తుందన్నది ఆసక్తికరం. బారాబటిలో ఘోర పరాభవం తర్వాత, చండీగఢ్‌లో బలంగా పుంజుకున్న సఫారీ జట్టు.. ధర్మశాలలో మరో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది.
జోరు కొనసాగించాలని..
తొలి టీ20లో కేవలం 74 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా.. రెండో మ్యాచ్‌లో 213 పరుగులు చేయడం అనూహ్యం. దీంతో ఇక ఆ జట్టును భారత్ తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. డికాక్ జోరందుకుంటే ఎలా ఉంటుందో చివరి వన్డేలో, రెండో టీ20లో భారత్‌కు బాగానే అనుభవమైంది. రెండో టీ20లో మార్క్రమ్, డొనోవన్ ఫెరీరా కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరికి తోడు హెండ్రిక్స్, బ్రెవిస్, మిల్లర్లతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ బలంగా ఉంది. చండీగఢ్‌లో సఫారీ బౌలర్లు కూడా అదరగొట్టారు. పేసర్లు బార్ట్‌మన్, ఎంగిడి, యాన్సెన్ కలిపి 8 వికెట్లు తీశారు. మరోసారి పేస్పైనే ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. ధర్మశాలలో పరిస్థితులు కూడా పేస్‌కు సహకరిస్తాయి కాబట్టి భారత బ్యాటర్లు జాగ్రత్త పడాల్సిందే. టీ20 వరల్డ్ కప్‌కు ఇంకెంతో సమయం లేదు. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ సూర్యకుమార్, శుభ్‌మన్ గిల్ ఫామ్ జట్టును టెన్షన్ పెడుతోంది. కొంతకాలంగా వీరిద్దరూ టీ20ల్లో పేలవ ఫామ్‌తో జట్టుకు భారంగా మారారు. టీ20ల్లో సూర్య హాఫ్ సెంచరీ చేసి ఏడాదవుతోంది. ఈ సిరీస్‌లో సూర్య, గిల్ ప్రదర్శన పేలవంగా ఉంది. సూర్య వరుసగా 12, 5 రన్స్ చేయగా.. గిల్ 4, 0 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ కీలకం కానుంది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం తీవ్రంగా ఉండటమే అందుకు కారణం. మంచు కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం చాలా కష్టతరం. కాబట్టి, చేజింగ్ సులభతరం కానుంది.