IND vs WI: ఢిల్లీ టెస్టులో విజయం ముంగిట భారత్
గెలుపునకు 58 రన్స్ దూరంలో టీమిండియా.. రెండో టెస్టులో పోరాడిన వెస్టిండీస్.. భారత్ ముందు 121 పరుగుల స్వల్ప లక్ష్యం
వెస్టిండీస్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో విజయానికి టీమిండియా 58 పరుగుల దూరంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ ముందు విండీస్ 121 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా.. వికెట్ నష్టానికి 63 రన్స్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 518/ 5 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 248, రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులు చేసి ఇన్నింగ్ ఓటమి తప్పిచుకుని పరువు నిలుపుకుంది. ఈ టెస్టులోనూ విండీస్ జట్టుకు ఓటమి తప్పట్లేదు కానీ.. మ్యాచ్‌ను అయిదో రోజు వరకు తీసుకెళ్లడం, తొలి ఇన్నింగ్స్‌లో 500 దాటిన భారత్‌తో రెండోసారి బ్యాటింగ్ చేయించడం అంటే ఆ జట్టుకు గొప్పే. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 200 పైచిలుకు ఓవర్లు బ్యాటింగ్ చేయడం ద్వారా టీమ్ఇండియాను బాగానే విసిగించింది విండీస్. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు బ్యాటర్లు ఇద్దరు సెంచరీలు కొట్టడం విశేషం. ఫలితంగా భారత్ ముందు 121 పరుగుల లక్ష్యం నిలవగా.. నాలుగో రోజు ఆట చివరికి 63/1తో విజయం ముంగిట ఉంది.
ఇద్దరు శతకాలు
ఓవర్ నైట్ స్కోరు 173/2తో నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ చాలా సేపటివరకు వికెట్ ఇవ్వలేదు. చివరకు జాన్ ఛాంబెల్ (115) సెంచరీ చేసిన తర్వాత రవీంద్ర జడేజా అతడిని ఔట్ చేశాడు. దీంతో 177 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా ఫర్వాలేదనిపించారు. దీంతో వెస్టిండీస్.. ఈ టెస్ట్ సిరీస్‌లో తొలిసారి ఆధిక్యంలోకి వెళ్లింది. ఛాంబెల్తో పాటు షై హోప్ (103) కూడా సెంచరీ చేశాడు. రోస్టన్ ఛేజ్ (40), జస్టిన్ గ్రేవ్స్ (50) ఫర్వాలేదనిపించారు. దీంతో వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ ముందు 121 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, జస్ప్రీత్ బుమ్రా 3, మహమ్మద్ సిరాజ్ 2, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ తీశారు.
భారత్ నెమ్మదిగా...
భారత్ ఛేదన ఆరంభమయ్యేటప్పటికి గంటన్నర సమయం ఉండడంతో నాలుగో రోజే మ్యాచ్‌ను ముగుస్తుందేమో అనిపించింది. అందుకు తగ్గట్లే యశస్వి చకచకా రెండు బౌండరీలు కొట్టి జోరుమీద కనిపించాడు. కానీ స్పిన్నర్ వారికన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన యశస్వి లాంగాన్‌లో క్యాచ్ ఔట్ కావడంతో ఇన్నింగ్స్ నెమ్మదించింది. ఆవేశపడితే అనవసరంగా వికెట్లు పడతాయనే ఉద్దేశంతో కేఎల్ రాహుల్ (25 బ్యాటింగ్), సుదర్శన్ (30 బ్యాటింగ్) ఆచితూచి బ్యాటింగ్ చేశారు. మరో వికెట్ కోల్పోకుండా ఆటను ముగించారు. నాలుగో రోజు భారత్ 18 ఓవర్లు బ్యాటింగ్ చేసింది. 9 వికెట్లు చేతిలో ఉన్న భారత్.. విజయానికి ఇంకో 58 పరుగులు చేయాలి. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే యశస్వి జైశ్వాల్ (8) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్ (25), సాయి సుదర్శన్ (30) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఆట చివరకు టీమిండియా 63/1తో నిలిచింది. మరో 58 రన్స్ చేస్తే.. భారత్ ఈ టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించి.. సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేయనుంది.