3rd T20: వరుణ్ మెరిసినా.. భారత్ కు తప్పని ఓటమి

మూడో టీ 20లో టీమిండియా ఓటమి... అయిదు వికెట్లతో రాణించిన వరుణ్ చక్రవర్తి;

Update: 2025-01-29 03:00 GMT

రాజ్ కోట్ వేదికగా జరిగిన మూడో టీ20లో టీమ్ ఇండియా.. ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైంది. 172 రన్స్ టార్గెట్‌ను భారత బ్యాటర్లు ఛేదించలేకపోయారు. టాప్ ఆర్డర్ మరోసారి విఫలమవ్వగా.. కీలక సమయంలో ఇంగ్లండ్ బౌలర్లు వికెట్లు తీసి భారత్‌పై ఒత్తిడి పెంచారు. హార్దిక్(40) రాణించినా ఫలితం లేకపోయింది. కాగా భారత్ 20 ఓవర్లలో 145పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం 5 టీ20ల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. వరుణ్ చక్రవర్తి మెరుపు బౌలింగ్ తో రాణించినా టీమిండియాకు ఓటమి తప్పలేదు.

రాణించిన ఇంగ్లాండ్ బ్యాటర్లు

ఈ మ్యాచ్ లో భాగంగా ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లీష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 09 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో అదరగొట్టగా.. పాండ్యా 2, బిష్ణోయ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ 28 బంతుల్లో అత్యధికంగా 51 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ 7 బంతుల్లో 5 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ 22 బంతుల్లో 24 పరుగులు సాధించాడు. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 5 మంది ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌లను ఔట్ చేశాడు. హార్దిక్ పాండ్యా 2 వికెట్లను పడగొట్టాడు. రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు.

తడబడ్డ బ్యాటర్లు

172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాటింగ్ లో విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేసింది. హార్థిక్ పాండ్య 35 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులు బాది 40 పరుగులు సాధించి టాప్ స్కోరర్ గా నిలిచాడు. సంజూశాంసన్ 3, అభిషేక్ శర్మ 24, సూర్య కుమార్ యాదవ్ 14, తిలక్ వర్మ 18, వాషింగ్టన్ సుందర్ 6,అక్షర్ పటేల్ 15, ధ్రువ్ జురెల్ 2, మహ్మద్ శమీ 7, రవి బిష్ణోయ్ 4, వరుణ్ చక్రవర్తి 1 పరుగులు సాధించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జామి ఓవర్టన్ 3 వికెట్లు, జోఫ్రా ఆర్చర్, బ్రైడెన్ కార్సే తలో రెండు వికెట్లు పడగొట్టారు. మార్క్ వుడ్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ తీశారు. భారత్ జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది. నాలుగో మ్యాచ్ జనవరి 31న పూణేలో జరుగనుంది.

వరుణ్ చక్రవర్తి అరుదైన ఘనత

ఇంగ్లండ్‌పై 5 వికెట్లు తీసి అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన వరుణ్ చక్రవర్తి అరుదైన ఘనత సాధించారు. దీంతో T20ల్లో రెండు సార్లు 5 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా అతడు నిలిచాడు. ఈ రికార్డును కుల్దీప్ యాదవ్ 40 మ్యాచుల్లో, భువనేశ్వర్ కుమార్ 87 మ్యాచుల్లో సాధించగా.. వరుణ్ కేవలం 16 మ్యాచుల్లోనే ఈ రికార్డ్ ఖాతాలో వేసుకున్నారు. గత 10 T20ల్లో వరుణ్ 27 వికెట్లు తీసి తన అద్భుతమైన ఫామ్ కనబరిచారు.

Tags:    

Similar News