INDIA vs PAK: షేక్ చేస్తున్న "షేక్ హ్యాండ్" వివాదం
పాక్ క్రికెటర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వని టీమిండియా.. షేక్ హ్యాండ్పై ఫిర్యాదు చేసేందుకు పీసీబీ..అలాంటి నిబంధన ఏదీ లేదన్న బీసీసీఐ
భారత్-పాకిస్తాన్ మధ్య ఈ ఏడాది ప్రారంభంలో తలెత్తిన పహల్గాం వివాదం తర్వాత తొలిసారిగా క్రికెట్ మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. అయితే, సంప్రదాయానికి భిన్నంగా, మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికీ నిరాకరించారు. ఇది ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చర్చకు దారితీసింది. ఇదేనా క్రీడాస్ఫూర్తి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. వీటికి టీమిండియా కూడా ధీటుగానే సమాధానంచెప్పింది. పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయవద్దని భారత జట్టు ఉన్నతాధికారులు కఠినంగా ఆదేశించారని సమాచారం. జట్టులోని ఆటగాళ్లందరూ కూడా అదే పాటించారు. అందిన సమాచారం ప్రకారం, భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు ముందు దీని గురించి అరగంట సమావేశం కూడా జరిగింది.
కలత చెందిన పాక్
పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్లు కూడా భారత ఆటగాళ్లతో కరచాలనం చేయకపోవడం పట్ల చాలా కలత చెందుతున్నారు. వారు టీమిండియా వైఖరితో సంతోషంగా లేరు. ఇది కేవలం ఆసియా కప్ మాత్రమేనని, ఐసీసీ టోర్నమెంట్లలో కూడా అదే జరగవచ్చని బాసిత్ అలీ అన్నారు. పాకిస్తాన్ టీవీ షోలో బాసిత్ అలీతో కలిసి కూర్చున్నప్పుడు కమ్రాన్ అక్మల్ కూడా టీమిండియా వైఖరిపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇది క్రికెట్ అభివృద్ధికి మంచిది కాదని ఆయన అన్నారు. భారత జట్టు చర్యపై పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రషీద్ లతీఫ్ మాట్లాడుతూ, ఇలా చేయడం ద్వారా వారు తమ నిజస్వరూపాన్ని చూపించిందని' తెలిపాడు. ఈ మొత్తం విషయంపై ఐసీసీని ఇరుకున పెట్టాడు. ఐసీసీ ఎక్కడ అంటూ ప్రశ్నించాడు.
తీవ్రంగా స్పందించిన బీసీసీఐ
ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అనంతరం చెలరేగిన 'హ్యాండ్‌షేక్' వివాదంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తీవ్రంగా స్పందించింది. మ్యాచ్ తర్వాత కరచాలనం చేయడం అనేది నిబంధనలలో లేదని, అది కేవలం స్నేహపూర్వక సంప్రదాయం మాత్రమేనని తేల్చి చెప్పింది. పాకిస్థాన్ చేసిన ఫిర్యాదుకు ఎలాంటి విలువా లేదని కొట్టిపారేసింది. "ఎవరికైనా సందేహం ఉంటే, ముందుగా క్రికెట్ రూల్ బుక్ చదువుకోవాలి. ప్రత్యర్థి జట్టుతో కరచాలనం చేయాలనే నిబంధన ఎక్కడా లేదు. అది ఆటగాళ్ల మధ్య ఉండే స్నేహభావం, సత్సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. అంతేతప్ప, అదొక చట్టం కాదు." అని బీసీసీఐ అధికారి స్పష్టం చేశారు.
పహల్గాం దాడి నేపథ్యంలో నిన్న దుబాయ్ వేదికగా భారత్-పాక్ మ్యాచ్ జరిగింది. అయితే, టాస్ మొదలు మ్యాచ్ ముగింపు వరకూ టీమిండియా ప్లేయర్లు పాక్ ఆటగాళ్లను మాటవరుసకైనా పలకరించలేదు. కరచాలనం కూడా చేయలేదు. టాస్ సందర్భంలో సూర్య, పాక్ కెప్టెన్ కరచాలనం చేసుకోలేదు. మ్యాచ్ ముగిసిన తరువాత కూడా భారత జట్టు ఆటగాళ్లు సైలెంట్‌గా మైదానాన్ని వీడారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం, టాస్ సమయంలో షేక్ హ్యాండ్‌కు సంబంధించి టీమిండియా ముందే తమ నిర్ణయాన్ని మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ద్వారా పాక్ జట్టుకు చేరవేసిందట. భారత ఆటగాళ్లతో కరచాలనానికి ప్రయత్నించొద్దని, భారత కెప్టెన్ సూర్యకుమార్‌ను సమీపించేందుకు ట్రై చేయొద్దని పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాకు మ్యాచ్ రిఫరీ ముందే సూచనలు చేశారు.