ACC: అదరగొట్టిన యువ భారత్

ఫైనల్లో బంగ్లాదేశ్ పై ఘన విజయం.. తొలి కప్పు భారత్ సొంతం;

Update: 2024-12-22 05:30 GMT

మహిళల అండర్‌-19 ఆసియాకప్‌ టోర్నీలో యువ భారత్‌ అదరగొట్టింది. టోర్నీలో అపజయమెరుగని నిక్కీ ప్రసాద్‌ సారథ్యంలోని టీమిండియా జూనియర్ మహిళల జట్టు... కౌలాలంపూర్‌లో జరిగిన ఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. దీంతో ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ తొలిసారిగా నిర్వహిస్తున్న టోర్నీని టీమ్‌ఇండియా సొంతం చేసుకున్నది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 117 పరుగులకు పరిమితమయింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన బంగ్లా జట్టు 76 రన్స్‌కే ఆలౌట్‌ అయింది. దీంతో 41 రన్స్‌తో విజయం సాధించిన యువ భారత్‌ టోర్నీని విజేతగా నిలిచింది.టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌.. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బ్యాటర్లు విఫలమవడంతో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 117 రన్స్‌కే పరిమితమైంది. అయితే కష్టాల్లో ఉన్న జట్టును తెలంగాణ యువ కెరటం గొంగడి త్రిష మరోసారి ఆదుకుంది. 5 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 41 బాల్స్‌లోనే 52 రన్స్‌ చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. మరో బ్యాటర్‌ మైథిలి వినోద్‌ 12 బాల్స్‌లోనే 17 పరుగులు రాబట్టింది. ఇక చేజింగ్‌కు దిగిన బంగ్లా బ్యాటర్లు భారత బౌలర్లను ఎదుర్కొలేకపోయారు. దీంతో 18.3 ఓవర్లలో 76 రన్స్‌కే ఆలౌట్‌ అయ్యారు. ఆయుశి శుక్లా 3 వికెట్లు తీయగా, పరుణికా సిసోడియా 2 వికెట్లు పడగొట్టింది.

సెమీస్ లో ఇలా..

శ్రీలంక‌తో జ‌రిగిన సెమీఫైన‌ల్ మ్యాచులో భార‌త్ 4 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక జ‌ట్టు మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 98 ప‌రుగులు చేసింది. లంక బ్యాట‌ర్ల‌లో మనుడి నానయక్కర (33; 30 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స‌ర్లు), సుముడు నిసంసాల (21) మాత్రమే రెండు అంకెల స్కోరు చేశారు. సజనా కవిండి (9), రష్మిక (8), హిరుణి హన్సిక (2), దహమి (5), లిమాన్స (1) సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అయ్యారు. భారత బౌలర్లలో ఆయూషి శుక్లా నాలుగు వికెట్ల‌తో రాణించింది. పరుణికా సిసోడియా రెండు వికెట్లు తీయ‌గా షబ్నమ్‌ షకీల్‌, దృతి కేసరి ఒక్కొ వికెట్ పడగొట్టారు. ఈ ల‌క్ష్యాన్ని భార‌త్ 14.5 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తెలుగు అమ్మాయి గొంగిడి త్రిష (32; 24 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), క‌మ‌లిని (28; 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించారు. లంక బౌల‌ర్ల‌లో చామోడి ప్రభోద మూడు, శశినీ గిమ్హాని రెండు వికెట్లు తీశారు.

Tags:    

Similar News