Japan Open-Badminton: సెమీస్‌లో ఓడిన లక్ష్యసేన్

9వ ర్యాంకు ఆటగాడు జొనాథన్ క్రిస్టీ చేతిలో 15-21, 21-13, 16-21 తేడాతో ఓడిపోయాడు. మ్యాచ్‌ ఓడినా 13వ ర్యాంకు ఆటగాడైన లక్ష్యసేన్ బెదురు లేకుండా ఆడి ఆకట్టుకున్నాడు.;

Update: 2023-07-29 17:08 GMT

Japan Open-2023 :జపాన్ ఓపెన్‌ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాడు లక్ష్యసేన్ సెమీస్‌లో ఓడి ఇంటిముఖం పట్టాడు. సెమీఫైనల్లో ఇండోనేషియా ప్లేయర్, 9వ ర్యాంకు ఆటగాడు జొనాథన్ క్రిస్టీ చేతిలో 15-21, 21-13, 16-21 తేడాతో ఓడిపోయాడు. మ్యాచ్‌ ఓడినా 13వ ర్యాంకు ఆటగాడైన లక్ష్యసేన్ బెదురు లేకుండా ఆడి ఆకట్టుకున్నాడు. సేన్‌ ఓటమితో ఈ టోర్నీలో భారత్ టైటిల్ ఆశలు ముగిసినట్టయింది.

మొదటి రౌండ్‌ ఆరంభంలో సేన్ ఆధిక్యంలో వచ్చనప్పటికీ, క్రిస్టీ పవర్‌ఫుల్ స్మాష్‌లతో స్కోర్ సమం చేయడమే కాకుండా, మొదటి సెట్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. మొదటి సెట్‌ని 21-15 తేడాతో గెలుచుకున్నాడు.



2వ రౌండ్‌లో పుంజుకున్న సేన్ దూకుడైన ఆటని ప్రదర్శించాడు. తెలివిగా ఆడుతూ షాట్లను కొట్టడంతో ప్రత్యర్థి వెనకంజ వేశాడు. శక్తివంతమైన స్మాష్‌లతో 11-4 తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అదే ఊపు కొనసాగించి సెట్‌ని 21-13 తో గెలిచి ప్రత్యర్థితో సమంగా నిలిచాడు.

నిర్ణయాత్మక 3వ సెట్‌లో ఇద్దరు ఆటగాళ్లు హోరాహోరీగా తలపడ్డారు. క్రిస్టీ కొన్ని పాయింట్ల ఆధిక్యం సాధించినా, సేన్ అద్భుతమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించాడు.  మరింత దూకుడు ప్రదర్శించిన క్రిస్టీ, కోర్టులు మారే సమయానికి 11-7 లీడ్‌లో ఉన్నాడు. సేన్‌ ఉత్తమంగా ఆడినప్పటికీ కొన్ని తప్పిదాలు చేయడంతో క్రిస్టీ తన ఆధిక్యాన్ని మరింతగా పెంచుకున్నాడు. చివరికి 21-16 పాయింట్ల తేడాతో సెట్‌ని గెలవడంతో పాటు, మ్యాచ్‌ని కూడా గెలిచాడు. దీంతో లక్ష్యసేన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

 లక్ష్యసేన్‌ ఇటీవల బ్యాడ్మింటన్ టోర్నీల్లో సెమీఫైనల్లో తలపడటం ఇది  వరుసగా 3వ సారి. ఇటీవలె కెనడా ఓపెన్‌ని గెలిచిన సేన్, US ఓపెన్, జపాన్ ఓపెన్‌లో సెమీ ఫైనల్లో ఓడిపోయాడు.

Tags:    

Similar News