INDvs WI: విండీస్‌ను చిత్తు చేసిన టీమిండియా
తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ విజయం.. 146 పరుగులకే కుప్పకూలిన విండీస్.. టీ బ్రేక్ వరకు నిలవలేకపోయిన కరేబియన్లు
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. మొదటి టెస్టులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు కేవలం 162 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన భారత బ్యాటర్లలో ముగ్గురు సెంచరీలు చేశారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసింది. అనంతరం మూడో రోజు ఆటను ప్రారంభించకముందే భారత్ డిక్లేర్ చేసింది. 286 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. అలాగే ఫీల్డర్లు సైతం మంచి ప్రదర్శన ఇవ్వడంతో రెండో ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ జట్టు 146 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత జట్టు ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ రెండో ఇన్నింగ్స్ లో భారత బౌలర్లలో సిరజ్ 3, జడేజా 4, కుల్దీప్ 2, సుందర్ 1 వికెట్ తీసుకున్నారు. ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. స్వదేశంలో తామెంత బలమైన జట్టో మరోసారి క్రికెట్ ప్రపంచానికిచ చాటి చెప్పింది.
విండీస్ ఇన్నింగ్స్ ఇలా..
286 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ను భారత బౌలర్లు తిప్పేశారు. వెస్టిండీస్ బ్యాటర్లు మరోసారి విఫలమయ్యారు. లంచ్‌కు ముందే అయిదు వికెట్లు కోల్పోయారు. లంచ్ సమయానికి కరేబియన్ జట్టు స్కోర్ 66/5గా ఉంది. లంచ్ అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన వెస్టిండీస్ జట్టు కనీసం టీ బ్రేక్ వరకు కూడా నిలవలేకపోయింది. వెస్టిండీస్ తన తొలి వికెట్‌ను 12 పరుగుల వద్ద చంద్రపాల్ రూపంలో కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో(7.2) చంద్రపాల్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే నితీశ్ రెడ్డి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. సిరాజ్ ఇచ్చిన శుభారంభాన్ని రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. చకచకా వికెట్లు కూల్చారు.
ముగ్గురు బ్యాటర్ల సెంచరీలు
ఓపెనర్ కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీలతో విజృంభించారు. ముగ్గురూ ఒకే రోజు శతకాలు నమోదు చేయడం విశేషం. కేఎల్ రాహుల్ (100; 190 బంతుల్లో, 12 ఫోర్లు), ధ్రువ్ జురేల్ (125; 210 బంతుల్లో, 15 ఫోర్లు, 3 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (104*; 176 బంతుల్లో, 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుతంగా రాణించారు. పంత్ జట్టుకు దూరమైన వేళ తనకు అందివచ్చిన అవకాశాన్ని ధ్రువ్ జురేల్ అద్భుతంగా ఒడిసి పట్టుకున్నాడు. ఈ ముగ్గురు బ్యాటర్ల శతకాలతో వెస్టిండీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు.