ఉత్తర్‌ప్రదేశ్‌లోని జంగల్ అయోధ్య ప్రసాద్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల విశాల్‌ది పేద కుటుంబం. నలుగురు పిల్లల్లో అతడే చిన్నోడు. నాన్న ఉమేశ్ కూలి చేసి కుటుంబాన్ని పోషించేవాడు. విశాల్‌కు క్రికెట్‌పై ఇష్టాన్ని గమనించిన అతడి తండ్రి ప్రోత్సహించాడు. విశాల్ కూడా నాన్నతో కలిసి కూలికి వెళుతూనే మరోవైపు క్రికెటర్‌గా ఎదిగాడు. తమ గ్రామం నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని గోరఖ్‌పూర్‌కు వెళ్లి క్రికెట్ ఆడేవాడు. ఆ కుర్రాడి పట్టుదలకు మెచ్చిన కోచ్ కల్యాణ్ సింగ్ అతడికి తన సంస్కృతి క్రికెట్ అకాడమీలో ఉచితంగా శిక్షణ ఇచ్చాడు. స్పిన్‌పై పట్టు సాధించిన అతడు.. ఆపై కాన్పూర్ క్రికెట్ అకాడమీలో అవకాశం రావడంతో ఈ లెఫ్ట్ఆర్మ్ స్పిన్నర్ మరింత మెరుగయ్యాడు. యూపీ టీ20 ప్రిమియర్ లీగ్ విశాల్ కెరీర్‌ను మలుపు తిప్పింది. గోరఖ్‌పూర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతడు..ఓ మ్యాచ్‌లో నితీశ్ రాణాను బోల్తా కొట్టించాడు. ఐపీఎల్లో ఆడే అవకాశం వస్తుందని విశాల్ కలలోనూ అనుకోలేదు. ఈ స్పిన్నర్‌పై పంజాబ్ కింగ్స్ నమ్మకం ఉంచడంతో వచ్చే ఏడాది ఐపీఎల్లో బరిలో దిగే అవకాశాన్ని దక్కించుకున్నాడు.
గంభీర్ జస్ట్ మేనేజర్: కపిల్
భారత మాజీ కెప్టెన్, 1983 వరల్డ్‌కప్ విజేత కపిల్ దేవ్ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(ICC) శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న కపిల్ దేవ్... ప్రస్తుత క్రికెట్లో హెడ్ కోచ్ పాత్ర ట్రెడిషనల్ కోచింగ్ కంటే ప్లేయర్ మేనేజ్మెంట్పైనే ఎక్కువగా ఉండాలని అన్నారు. "ఈ రోజుల్లో కోచ్ అనే పదాన్ని చాలా లూజ్‌గా వాడుతున్నారు. గంభీర్ అసలు కోచ్ కాదు, జట్టుకు మేనేజర్ మాత్రమే. స్కూల్, కాలేజీల్లో నేర్పేవాళ్లే నిజమైన కోచ్‌లు. ఇంటర్నేషనల్ స్థాయిలో ఆటగాళ్లు ఇప్పటికే స్పెషలిస్ట్‌లు. లెగ్ స్పిన్నర్‌కు, వికెట్ కీపర్‌కు గంభీర్ ఎలా కోచింగ్ ఇస్తాడు?" అని వ్యాఖ్యానించారు. మేనేజర్‌గా ఆటగాళ్లను ప్రోత్సహించడం, వారిలో నమ్మకం నింపడం, మానసిక సౌకర్యం కల్పించడమే ముఖ్యమని కపిల్ అన్నారు. ఫామ్‌లో లేని ప్లేయర్లకు అండగా నిలవడం కెప్టెన్, మేనేజర్ బాధ్యత అని తెలిపారు. గంభీర్ ఇకపై ఈ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించాలని కోరారు. దక్షిణాఫ్రికాతో సొంత దేశంలో 0-2 టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత గంభీర్‌పై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో కపిల్ వ్యాఖ్యలు మరోసారి సంచలనం రేపాయి. "ఒకరు ఇప్పటికే లెగ్ స్పిన్నర్ లేదా వికెట్ కీపర్ అయినప్పుడు.. అలాంటి వారికి మీరు ఏం కోచింగ్ ఇస్తారు? గౌతమ్ గంభీర్.. ఒక లెగ్ స్పిన్నర్ లేదా వికెట్ కీపర్‌కు ఎలా కోచింగ్ ఇస్తారు?" అని కపిల్ దేవ్ ప్రశ్నించారు. దీనికి బదులుగా.. ఆటగాళ్ల వ్యక్తిత్వాలను మేనేజ్ చేయడం.. సరైన వాతావరణాన్ని సృష్టించడం ముఖ్యమని కపిల్ తెలిపారు. వాళ్లు సాధించగలరని వాళ్లే నమ్మేలా చేయాలన్నారు. కాగా, ప్లేయర్లకు కంఫర్ట్, భరోసా ఇచ్చి.. మీరు ఇంకా బాగా చేయగలరు అని ఆత్మవిశ్వాసం పెంపొందిచాలని కపిల్ దేవ్ అన్నారు. తాను కోచ్‌ను ఇలాగే చూస్తానన్నారు. గంభీర్ పై కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.