IPL: విదేశీ ఆటగాళ్లు రాకున్నా ఐపీఎల్ ఆగదు
ఆసక్తికరంగా పంజాబ్ కింగ్స్ పోస్ట్.. ఇది ఇండియన్ ఐపీఎల్ అంటూ శ్రేయస్ కామెంట్స్;
భారత్, పాకిస్థాన్ సరిహద్దుల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడి మళ్లీ ఆరంభమైన విషయం తెలిసిందే. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో తిరిగి ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభం అయ్యాయి. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అయితే ఆయా జట్ల తరఫున విదేశీ ఆటగాళ్లలో తిరిగి ఎంతమంది ఆడుతున్నారనే విషయంలో ఇంకా సందిగ్ధతే కొనసాగుతోంది. ముఖ్యంగా జూన్ 11 నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరగనున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. పునఃప్రారంభం కానున్న ఐపీఎల్‌లో పాల్గొనే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ ఎక్స్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. దీని ద్వారా పంజాబ్ కెప్టెన్ విదేశీ ఆటగాళ్లనుద్దేశించి ఒక చక్కటి సందేశం ఇచ్చాడు. మొదట ఆ వీడియోలో ఇద్దరు వ్యక్తులు జోస్ ఇంగ్లిస్, మార్కస్ స్టాయినిస్, జోష్ హేజిల్‌వుడ్, మార్క్ ఎన్‌సన్ ఐపీఎల్‌కు తిరిగి వస్తున్నారా? లేదా? అని చర్చించుకుంటారు. అప్పుడు శ్రేయస్ అయ్యర్ వచ్చి.. ‘‘మీరు చెబుతున్న వాళ్లంతా నిజంగా ప్రతిభ ఉన్న క్రీడాకారులే. కానీ ఇది ‘ఇండియన్’ ప్రీమియర్ లీగ్’’ అని చెప్పి వెళ్లిపోతాడు. విదేశీ ఆటగాళ్లు వచ్చినా.. రాకున్నా.. ఐపీఎల్ ఆగదు అనే ఉద్దేశంతో శ్రేయస్ ఇలా అన్నాడు.
మహిళలను వేధిస్తున్నారు: రాబిన్
ఇటీవల CSK, RCB మధ్య జరిగిన మ్యాచులో అభిమానుల మధ్య గొడవ అదుపు తప్పిందని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఆందోళన వ్యక్తం చేశాడు. 'ఆర్‌సీబీ, సీఎస్‌కే ఫ్యాన్స్ గొడవ ఆందోళనకరంగా మారింది. స్టేడియం బయట ఆటగాళ్ల బస్సు వెళ్తున్నప్పుడు వారిని హేళన చేయడం, అభిమానులు కొట్టుకోవడం, మహిళలను వేధించడం వంటి ఘటనలు బాధాకరం. ఇలాంటి ప్రవర్తన క్రీడా స్ఫూర్తికి విరుద్ధం' అని ఊతప్ప పేర్కొన్నారు.