IPL: ఉత్కంఠభరిత మ్యాచ్‌లో గెలిచిన "లఖ్"నవూ
చివరి బంతి వరకూ సాగిన ఉత్కంఠ...లఖ్‌నవూను గెలిపించిన ముకుల్ చౌదరీ.. కోల్‌కతాను వెంటాడిన మరో ఓటమి
ఐపీఎల్ 2026లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో లఖ్‌నవూ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఈ పోరులో లఖ్‌నవూ జట్టు చివరి వరకూ పోరాడి 3 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని చేరుకుంది. మ్యాచ్ మొత్తం ప్రేక్షకులను కుర్చీలకు కట్టేసేలా సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. జట్టు ప్రారంభం స్థిరంగా సాగింది. కెప్టెన్ అజింక్యా రహానే మరోసారి తన అనుభవాన్ని ప్రదర్శిస్తూ 24 బంతుల్లో 41 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. అతనికి మంచి మద్దతు అందించిన యువ బ్యాటర్ రఘువంశీ 33 బంతుల్లో 45 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మధ్య ఓవర్లలో గ్రీన్ 32 పరుగులతో స్థిరంగా ఆడగా, పావెల్ చివర్లో వేగంగా ఆడుతూ 39 పరుగులు చేసి స్కోరు వేగాన్ని పెంచాడు. దీంతో కోల్‌కతా జట్టు మంచి స్కోరు నమోదు చేసింది. అయితే భారీ స్కోరు కాకపోయినా పోటీగా నిలిచే లక్ష్యాన్ని మాత్రం సెట్ చేసింది.
లఖ్‌నవూ బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్, దిగ్వేశ్ రాఠీ, ఆవేశ్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టి నియంత్రణలో ఉంచే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ చివరి ఓవర్లలో కోల్‌కతా బ్యాటర్లు వేగంగా పరుగులు చేయడంతో స్కోరు 180 దాటింది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్‌నవూ జట్టు ప్రారంభంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొంది. టాప్ ఆర్డర్ ఎక్కువగా నిలబడలేకపోయింది. ఒక దశలో 128 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో పడింది. మ్యాచ్ పూర్తిగా కోల్‌కతా వైపు మళ్లినట్లే కనిపించింది. అయితే ఆ సమయంలో బదోనీ అద్భుతంగా ఆడుతూ జట్టును నిలబెట్టాడు. అతను 34 బంతుల్లో 54 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో అతని ఇన్నింగ్స్ ఆకట్టుకుంది. కానీ మ్యాచ్‌ను పూర్తిగా మలుపు తి మరో బ్యాటర్ ముకుల్ చౌదరి అద్భుత ప్రదర్శనే. చివరి వరకు క్రీజులో నిలిచిన ముకుల్ చౌదరి 27 బంతుల్లో అజేయంగా 54 పరుగులు చేసి మ్యాచ్‌ను లఖ్‌నవూ వైపు తిప్పాడు.
చివరి ఓవర్లో ఉత్కంఠ
ఆఖరి ఓవర్లో లఖ్‌నవూకు 14 పరుగులు అవసరమయ్యాయి. మొదటి బంతికి ఆవేశ్ ఖాన్ సింగిల్ తీసి స్ట్రైక్ ముకుల్‌కు ఇచ్చాడు. రెండో బంతికి ముకుల్ భారీ సిక్స్ బాదడంతో మ్యాచ్ మళ్లీ ఉత్కంఠగా మారింది. ఆ తర్వాతి రెండు బంతుల్లో పరుగులు రాకపోవడంతో ఒత్తిడి పెరిగింది. చివరి రెండు బంతులకు 7 పరుగులు అవసరమయ్యాయి. ఐదో బంతికి ముకుల్ మరో సిక్స్ కొట్టి స్కోరు సమం చేశాడు. చివరి బంతికి అతను షాట్ మిస్ చేసినప్పటికీ, బై రూపంలో ఒక పరుగు రావడంతో లఖ్‌నవూ విజయాన్ని అందుకుంది. ఈ ముగింపు మ్యాచ్‌ను మరింత రసవత్తరంగా మార్చింది.
పోరాడినా తప్పని ఓటమి
కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్ తలో రెండు వికెట్లు తీసి మెరుగైన ప్రదర్శన చేశారు. అలాగే సునీల్ నరైన్ కార్తిక్ త్యాగి, కామెరూన్ గ్రీన్ ఒక్కో వికెట్ సాధించారు. అయినప్పటికీ చివరి ఓవర్లలో మ్యాచ్‌ను కట్టడి చేయలేకపోయారు. ఈ ఓటమితో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఇది నాలుగు మ్యాచ్‌లలో మూడో పరాజయం అయింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో వారికి ఒక్క పాయింట్ మాత్రమే లభించింది. మరోవైపు లఖ్‌నవూ ఈ విజయంతో తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. మొత్తానికి ఈ మ్యాచ్ ఐపీఎల్ 2026లో అత్యంత ఉత్కంఠభరిత పోరాటాల్లో ఒకటిగా నిలిచింది. చివరి బంతి వరకు ఫలితం తెలియని ఈ పోరు ప్రేక్షకులకు అసలైన క్రికెట్ మజాను అందించింది.