IPL: మనోళ్లకీ తీరిక ఎక్కడ ఉంది?
టీమిండియా క్రికెటర్లు విదేశీ లీగుల్లో ఆడే అవకాశం లేదన్న ధుమాల్
ప్రపంచవ్యాప్తంగా ఎన్ని క్రికెట్ లీగులు ఉన్నా.. ఐపీఎల్‌కు ఉన్న క్రేజే వేరు. అలాగే భారత క్రికెటర్లు రిటైర్ అయితే తప్ప విదేశీ లీగుల్లో ఆడటానికి వీల్లేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ లాంటి స్టార్ ప్లేయర్లు కేవలం ఐపీఎల్‌లోనే ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడగలరు. దీనిపై ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్ మాట్లాడారు. సమీప భవిష్యత్తులో టీమిండియా క్రికెటర్లు విదేశీ లీగుల్లో ఆడే అవకాశం లేదని తేల్చిచెప్పారు. దీనికి వర్క్‌లోడ్ మేనేజ్మెంటే కారణమని ఆయన వివరించారు. ‘మన క్రికెటర్లకు ఉన్న వర్క్‌లోడ్‌ను ఒక్కసారి గమనించండి. టీమిండియా ఆటగాళ్లు కచ్చితంగా దేశవాళీల్లో ఆడాలన్న బీసీసీఐ నియమం ఉంది. అందుకే వారు విజయ్ హజారే ట్రోఫీ ఆడాల్సి ఉంది. అలాగే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కూడా. ఇలా భారత్‌లోనే ఆడటానికి చాలా క్రికెట్ ఉంది. ఇక్కడే చాలామంది అభిమానులూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికి విదేశీ లీగుల్లో ఆడేందుకు అవకాశం ఉంటుందని నేను అనుకోను’ అని అరుణ్ సింగ్ ధుమాల్ అన్నారు. ‘ప్రస్తుతం పెద్ద ప్లేయర్లు విదేశీ లీగుల్లో ఆడలేరు. వారికి అసలు ఎలా వీలవుతుంది? చాలామంది క్రికెటర్లు మూడు ఫార్మాట్లలో ఆడుతున్నారు. వారికి తీరిక ఎక్కడ ఉంది? కొంతమంది బౌలర్లకు రెండు టెస్ట్‌ల తర్వాత విశ్రాంతి ఇస్తున్నాం. అలాగే టీ20లు, వన్డేల నుంచి విరామం ఇస్తున్నాం.
‘ఇకపై మరిన్ని జాగ్రత్తలు’
టీమిండియా, సౌతాఫ్రికాల మధ్య బుధవారం లఖ్‌నవూలో జరగాల్సిన నాలుగో T20 మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దు అయిన విషయం తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ తమ ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. వేదికల ఎంపిక విషయంలో వాతావరణ పరిస్థితులను బీసీసీఐ పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించాడు. ఇకపై మ్యాచ్‌లు జరిగే వేదికల ఎంపిక విషయంలో ఇక నుంచి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. లక్నోలో టీ20 రద్దు కావడం అందరినీ నిరాశకు గురిచేసిందని తెలిపారు. మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. చివరి నిమిషం వరకు మ్యాచ్‌ను జరిపించేందుకు ప్రయత్నించామని పేర్కొన్నారు. కానీ, పొగమంచు వల్ల రద్దు చేయాల్సి వచ్చిందని సమాధానమిచ్చారు. ఈ నెల 15 నుంచి జనవరి 15 వరకు పొగమంచు చాలా పెద్ద సమస్యగా ఉందన్నారు. ఇక నుంచి భవిష్యత్‌లో మ్యాచ్‌ల షెడ్యూళ్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటామని రాజీవ్ తెలిపారు. సాయంత్రం 6:30కు పడాల్సిన టాస్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అంపైర్లు దాదాపు ఆరుసార్లు మైదానాన్ని తనిఖీ చేశారు. మ్యాచ్‌ను ప్రారంభించే పరిస్థితులు కనిపించకపోవడంతో చివరకు రాత్రి 9:30కు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ ప్రణాళికా లోపాన్ని వేలెత్తి చూపారు. లఖ్‌నవూలోని స్థానిక ఫ్యాన్స్ మ్యాచ్‌ను రాత్రి పూట కాకుండా, పగటి పూట నిర్వహించి ఉంటే బాగుండేదని అభిప్రాయ పడ్డారు.ఇక సౌతాఫ్రికాతో చివరి టీ20 మ్యాచ్ నేడు అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. జనవరి 11వ తేదీ నుంచి న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ సందర్భంగా టీమ్ఇండియాన్యూజిలాండ్తో వడోదర, రాజ్‌కోట్, ఇండోర్ వేదికగా 3 వన్డేలు, నాగ్‌పుర్, రాయ్‌పుర్, గువాహటి, విశాఖ, తిరువనంతపురం వేదికగా ఐదు టీ20లు ఆడనుంది.