KOHLI: టెస్టులకు క్రికెట్ 'కోహ్లీ' నూర్ గుడ్ బై

14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు రన్ మెషిన్ వీడ్కోలు;

Update: 2025-05-13 01:30 GMT

అనుకున్నదే జరిగింది. క్రికెట్ ప్రపంచం అనుమానమే నిజమైంది. భారత అభిమానుల గుండె పగిలింది. మాజీలు వద్దని వారించినా.. బీసీసీఐ ప్రత్యేక విజ్ఞప్తి చేసినా.. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వెనక్కి తగ్గలేదు. టెస్టులకు వీడ్కోలు పలుకుతూ సంచలన ప్రకటన చేశాడు. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ కు రన్ మెషిన్ వీడ్కోలు పలికాడు. విరాట్ వీడ్కోలుకు ఇది సమయం, సందర్భం కాదని మాజీలు విజ్ఞప్తి చేసినా... సోదరా గుడ్ బై వద్దంటూ యువ క్రికెటర్లు కోరినా కోహ్లీ వెనకడుగు వేయలేదు. క్రికెట్ కోహీనూర్ టెస్టులకు వీడ్కోలు పలికడంతో ప్రపంచ క్రికెట్ లో మహోజ్వల శకం ముగిసింది. రోహిత్ టెస్టుల నుంచి తప్పుకున్న వారం రోజులలోపే కోహ్లీ కూడా వీడ్కోలు పలకడం టీమిండియా అభిమానులను షాక్‌కు గురిచేసింది. భారీ అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న కోహ్లీ... భారత చిరస్మరణీయ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే టీ 20లకు వీడ్కోలు పలికిన కోహ్లీ... ఇప్పుడు సాంప్రదాయ క్రికెట్ ను వీడాడు. ఇక వన్డేల్లో మాత్రమే రన్ మెషిన్ కనపడనున్నాడు.

టీమిండియా దిగ్గజ ఆటగాడు, రన్ మెషిన్, కింగ్ కోహ్లీ సంచలన ప్రకటన చేశాడు. కొన్ని రోజులగా అతడి టెస్టు రిటైర్మెంట్ పై వస్తున్న ఊహాగానాలు నిజమయ్యాయి. సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు కింగ్ కోహ్లీ ప్రకటించాడు. ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపాడు. రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకున్న వారం రోజుల లోపే కోహ్లీ కూడా టెస్టులకు వీడ్కోలు పలకడం టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ అనే చెప్పాలి. జూన్ నెలలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. సిరీస్ కు ముందు రోహిత్, కోహ్లీ టెస్టుల నుంచి వైదొలగడం అభిమానులకు షాక్ ఇచ్చింది.

విరాట్ పోస్ట్

‘టెస్టుల్లో అరంగేట్రం చేసి 14 ఏళ్లు అవుతుంది. ఇన్ని రోజులు టెస్టులు ఆడతానని అనుకోలేదు. ఈ ఫార్మాట్ నన్ను అనేక రకాలుగా పరీక్షించింది, గొప్ప ప్లేయర్‌గా మార్చింది. ఎన్నో పాఠాలను నేర్పింది. వీటిని నా జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. తెల్ల జెర్సీల్లో ఆడటం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. ఐదు రోజుల పాటు ఆడటం.. టెస్టు కెరీర్‌లో ప్రతి చిన్న విషయాన్ని నేను అస్వాదించాను. అవి ఎప్పటికీ నాతోనే ఉంటాయి. టెస్టులకు గుడ్ బై పలకడం అంత సులభమైన విషయం కాదు. కానీ, నేను చేస్తుంది సరైనదే. టెస్టు ఫార్మాట్‌కు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాను. అలాగే ఈ ఫార్మాట్ నుంచి నేను ఊహించిన దాని కంటే ఎక్కువే పొందాను. టెస్టుల నుంచి నేను గర్వంగా తప్పుకుంటున్నాను. ఆటకు.. ప్రజలకు, నాతో పాటు ఆడిన ప్లేయర్లకు.. నా జర్నీకి కారణం అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా టెస్టు కెరీర్ పట్ల నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను. ఇక సెలవు" అంటూ బావోద్వేగంతో కూడిన వీడ్కోలు పోస్ట్ ను కోహ్లీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పెట్టాడు.

అంత తేలిక కాదు కానీ...

టెస్ట్ ఫార్మాట్‌ నుంచి దూరం జరగడం అంత తేలిక కాదని కోహ్లీ తన పోస్ట్ లో పేర్కొన్నాడు. కానీ తన నిర్ణయం సరైనదే అనిపిస్తోందని తెలిపాడు. ఈ ఫార్మాట్‌ కోసం తాను ఎంతో ఇచ్చానని... తాను ఆశించిన దాని కంటే ఎక్కువే ఇది తనకు తిరిగిచ్చిందని విరాట్ భావోద్వేగ పోస్ట్ చేశాడు. మనసు నిండా సంతృప్తితో, కృతజ్ఞతాభావంతో టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నానని అన్నాడు. "వెనక్కి తిరిగి నా టెస్టు కెరీర్‌ను చూసుకుంటే నా ముఖంలో చిరునవ్వు కన్పిస్తుంది. ప్రేమతో ఇక సైనింగ్‌ ఆఫ్‌..’’ అని కోహ్లీ తన పోస్టులో రాసుకొచ్చాడు.

14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్

2011లో విరాట్ కోహ్లీ.. భారత జట్టు తరఫున సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అడుగుపెట్టాడు. తన కెరీర్‌లో 123 టెస్టు మ్యాచులు ఆడిన కోహ్లీ.. 9230 రన్స్ స్కోరు చేశాడు. ఇందులో 7 డబుల్ సెంచరీలు, 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

దిగ్గజాలు సూచించినా..

ఇటీవల రోహిత్ టెస్టుకు వీడ్కోలు పలికాడు. అప్పటినుంచి కోహ్లీ గుడ్‌బై చెప్పేస్తాడని ప్రచారం జరిగింది. దీనిపై మాజీ క్రికెటర్లు కోహ్లీ నిర్ణయం మార్చుకోవాలని సూచించారు. టెస్టు క్రికెట్‌కు అతడి అవసరం ఉందని.. దయచేసి నిర్ణయం మార్చుకోవాలని సూచించారు. బ్రియాన్ లారా సైతం ఇదే రిక్వెస్ట్ చేశాడు. అంబటి రాయుడు, నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ, మైకెల్‌ వాన్ ఇలా ఎంతో మంది కోహ్లీ మరింత కాలం టెస్టు క్రికెట్‌లో కొనసాగాలని అభిప్రాయం వ్యక్తం చేసినా కోహ్లీ నిర్ణయాన్ని మార్చుకోలేదు.

Tags:    

Similar News