Messi-Inter Miami: అదరగొడుతున్న మెస్సీ, 2 మ్యాచుల్లో 3 గోల్స్
అట్లాంటాతో జరిగిన పోరులో 2 గోల్స్‌తో పాటు, ఒక అసిస్ట్‌తో జట్టుకు విజయాన్నందించాడు.;
Lionel Messi-Inter Messi: అమెరికాలోని ఇంటర్ మియామీ ఫుట్‌బాల్ క్లబ్ తరపున మొన్న ఆరంగేట్రం చేసిన దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సీ ఆ జట్టు తలరాతను మారుస్తున్నాడు. తన నైపుణ్యాలతో గోల్స్ కొడుతూ వరుస పరాజయాలతో ఉన్న మియామీ జట్టుకు వరుసగా రెండవ విజయాన్ని అందించాడు. గత మ్యాచ్‌లో చివరి నిమిషంలో అద్భత ఫ్రీకిక్‌తో గెలుపు గోల్ చేసిన మెస్సీ, ఈ రోజు అట్లాంటాతో జరిగిన పోరులో 2 గోల్స్‌తో పాటు, ఒక అసిస్ట్‌తో జట్టుకు విజయాన్నందించాడు. నిర్ణీత సమయానికి మియామీ జట్టు 4-0గోల్స్ తేడాతో విజయం సాధించింది. లీగ్స్ కప్‌లో నాకౌట్ దశకు దూసుకెళ్లింది. లియోనల్ మెస్సీని ఇంటర్ మియామీ జట్టు తమ కెప్టెన్‌గా ప్రకటించింది.
మ్యాచ్ ఆరంభమైన 8వ నిమిషంలోనే మెస్సీ గోల్ కొట్టాడు. మొదట తను కొట్టిన షాట్ గోల్ పోస్ట్ బార్ తాకి వెనక్కి రాగా, మళ్లీ బంతిని అందుకుని మొదటి గోల్ అందించాడు. 21వ నిమిషంలో మరో ఫార్వర్డ్ టేలర్ నుంచి బంతిని అందుకుని ట్యాపిన్ ద్వారా గోల్ సాధించి జట్టుని 2-0 ఆధిక్యం అందించాడు. హాఫ్ టైం ముగిసే సమయానికి మియామీ జట్టు 3-0 తేడాతో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.
2వ అర్ధ భాగం ఆరంభమైన 8వ నిమిషంలోనే టేలర్ గోల్ కొట్టడంలో సహాయం చేశాడు. అనంతరం 77వ నిమిషంలో ప్రేక్షకుల అభివాదాల మధ్య సబ్‌స్టిట్యూట్ ఆటగాడి స్థానంలో మైదానం వీడాడు.
మెస్సీ ఫ్రాన్స్ క్లబ్ పీఎస్‌జీని వీడి ఇంటర్ మియామీలో చేరిన సంగతి తెలిసిందే. తాను ఆడిన 2 మ్యాచుల్లోనే 3 గోల్స్, 1 అసిస్ట్‌తో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు.