OLYMPICS: చరిత్ర సృష్టించిన మను బాకర్
ఒలింపిక్స్‌లో భారత్ పతక బోణీ.. షూటింగ్‌లో మను బాకర్‌కు కాంస్యం;
ఒలింపిక్స్‌లో భారత స్టార్ షూటర్ మను బాకర్ చరిత్ర సృష్టించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్ కాంస్యం సొంతం చేసుకుంది. విశ్వ క్రీడల్లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా మను రికార్డు సృష్టించింది. విశ్వ క్రీడల్లో భారత్ పతకాల బోణి కొట్టింది. తొలిరోజు నిరాశే ఎదురైనా, పారిస్ ఒలింపిక్స్‌లో రెండో రోజు భారత్ కు తొలి పతకం లభించింది. షూటింగ్‌లో మనుబాకర్ భారత్‌కు తొలి పతకం అందించింది. 10మీ.ఎయిర్ పిస్టల్ మహిళల ఫైనల్ లో కాంస్యం సాధించింది. తొలి పతకంతో త్రివర్ణ పతకాం రెపరెపలాడించింది. షూటింగ్ లో భారత్ కు మెడల్ సాధించిన తొలి మహిళా షూటర్ గా చరిత్ర లిఖించింది. దక్షిణ కొరియాకు చెందిన ఓ యే జిన్ స్వర్ణం కైవసం చేసుకుంది. అదే దేశానికి చెందిన కిమ్ యేజి రజతంతో సరిపెట్టుకోగా, భారత్ కు చెందిన మను బాకర్ కాంస్యం నెగ్గింది. స్వర్ణం సాధించిన ఓ యే జిన్ ఓవరాల్ గా 242.2 పాయింట్లతో సత్తా చాటింది. రజతం సాధించిన కిమ్ యేజి 241.3 పాయింట్లు, మను బాకర్ 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని సాధించింది.
నన్ను నడిపించింది భగవద్గీతే
ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత మహిళా షూటర్‌గా మను బాకర్ చరిత్ర సృష్టించింది. అయితే తన గెలుపులో భగవద్గీత కీలక పాత్ర పోషించిందని విజయం అనంతరం బాకర్ వ్యాఖ్యానించింది. అర్జునుడికి కృష్ణుడు చేసిన హితోపదేశమే తనకు మార్గ నిర్దేశం చేసిందని తెలిపింది. మీరు కర్మపై దృష్టి పెట్టండని.. ఫలితంపై కాదన్న భగవద్గీత శ్లోకమే తనలో స్ఫూర్తి నింపిందని వెల్లడించింది. "నిజాయితీగా చెప్పాలంటే, నేను భగవద్గీత చదివాను. అది నాపై చెరగని ముద్ర వేసింది. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చేయి. ఫలితం గురించి మాత్రం ఆలోచించకు. ఫలితం ఎలా ఉన్నా దాని గురించి పట్టించుకోవద్దు. అని గీతలో అర్జునుడికి కృష్ణుడు హితోపదేశం చేశాడు.
మీరు కర్మపై దృష్టి పెట్టండి, ఫలితంపై కాదన్న ఆ మార్గ నిర్దేశ వ్యాఖ్యలే నన్ను ముందుకు నడిపిస్తున్నాయి “ అని మను బాకర్ అన్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో తన ప్రదర్శనతో చాలా నిరుత్సాహానికి గురయ్యానని తెలిపింది. దాని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని... అక్కడి నుంచి కోలుకుని ఇప్పుడు ఈ పతకం సాధించానని మను బాకర్ తెలిపింది. తాను గతంపై దృష్టి పెట్టనని.. వర్తమానంపై దృష్టి పెడతానని మనుబాకర్ తెలిపింది. ఈ విజయం సాధించినందుకు తాను చాలా గర్వపడుతున్నానని తెలిపింది.