Muttiah Muralitharan : నన్నెవరూ దాటలేరు.. స్పిన్ మాంత్రికుడు మురళీధరన్ ధీమా

Update: 2024-09-11 12:00 GMT

టెస్టుల్లో తన రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరని శ్రీలంక మాజీ దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ధీమాగా చెప్పారు. టెస్టుల్లో మరెవరికీ సాధ్యం కానీ గొప్ప రికార్డు మురళీధరన్ పేరిట ఉంది. అతడు టెస్టు క్రికెట్ చరిత్రలో ఏకంగా 800 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు సుదీర్ఘ ఫార్మాట్లో తన రికార్డును బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యమని తాజాగా ఓ ఇంటర్వ్యూలో మురళీ ధరన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు.

ప్రస్తుతం ఆటగాళ్లందరూ టీ20 క్రికెట్ వైపు మొగ్గుచూపుతున్నారనీ.. అందుకే టెస్టు క్రికెట్ కు ఆదరణ క్రమంగా తగ్గుతోందని మురళీధరన్ చెప్పాడు. అందుకే.. తన రికార్డ్ పదిలంగా ఉండబోతుందని అన్నాడు. యాషెస్ సిరీస్ తప్ప మిగతా టెస్టులకు ఆదరణ కరువైందన్నాడు. "మా కాలంలో ఆటగాళ్లు కనీసం 20 ఏళ్లు ఆడేవారు. కానీ నేటి తరం క్రికెటర్ల కెరీర్ తగ్గిపోయింది. అందుకే నా 800 వికెట్ల రికార్డు అధిగమించే అవకాశం కనిపించడం లేదు" అని మురళీధరన్ చెప్పాడు.

మురళీధరన్ తర్వాత స్థానం 708 వికెట్లతో ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం షేన్ వార్న్ ది. ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ 704 వికెట్లతో మూడో స్థానంతో ఇటీవలే కెరీర్ ముగించాడు. ప్రస్తుత క్రికెటర్లలో నాథన్ లైయన్ (530), రవిచంద్రన్ అశ్విన్ (516) వికెట్లతో ఉన్నా మురళీధరన్ రికార్డు బ్రేక్ చేయడం అసాధ్యమేనని చెబుతున్నారు నిపుణులు.

Tags:    

Similar News