OLYMPICS: అదిరిపోయిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు
ఫ్రాన్స్ చరిత్ర, సంస్కృతిని చాటాలే ఆరంభ వేడుకలు... ప్రత్యేక ఆకర్షణగా వర్చువల్ టెక్నాలజీ;
క్రీడా చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించేలా... ఫ్రాన్స్ సంస్కృతిని, వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా.. పారిస్ ఒలింపిక్స్ 2024 ఘనంగా ఆరంభమయ్యాయి. క్రీడా దిగ్గజాలు. రాజకీయ ప్రముఖుల మధ్య ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఒలింపిక్స్ ప్రారంభమవుతున్నట్లు ప్రకటించాడు. భారీ వర్షం కురిసినా లక్షలాదిమంది అభిమానులు వేడుకకు హాజరయ్యారు. చరిత్రలో నిలిచిపోయేలా పారిస్ ఈ వేడుకలను నిర్వహించింది. ముసుగు ధరించిన వ్యక్తి టార్చ్‌తో పరుగులు తీస్తూ ఫ్రాన్స్ చరిత్ర, వైభవాన్ని.. పారిస్‌లోని ప్రత్యేకతలన్నింటికీ ప్రపంచానికి చాటుతూ ముందుకుసాగాడు. తాడు సాయంతో గాల్లోకి ఎగిరి నది దాటి అబ్బురపరిచాడు. వర్చువల్ టెక్నాలజీ ద్వారా మరో వ్యక్తి ఫ్రాన్స్ గత చరిత్రను, వైభవాన్ని, తరతరాల సంస్కృతిని చాటి చెప్పాడు. ఈ వర్చువల్ టెక్నాలజీ ద్వారా పారిస్‌లోని చారిత్రక కట్టడాలను ప్రపంచ కళ్లకు కట్టారు. లవ్ సిటీ ప్రత్యేకతను తెలిపేలా ఆకాశంలో విమానాల పొగతో ఏర్పాటు చేసిన హార్ట్ సింబల్ క్రీడా అభిమానులను అబ్బురపరిచింది.
ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలో అమెరికన్ పాప్ స్టార్ లేడీ గాగా ఉర్రుతలూగించింది. ఒలింపిక్స్ సంబరాలు లేడీ గాగా ప్రదర్శనతోనే ప్రారంభమయ్యాయి. "మోన్ ట్రూక్ ఎన్ ప్లూమ్స్" అంటూ గాగా పాడిన పాటకు లక్షలాది మంది అభిమానులు గొంతు కలిపారు. ఈ పాటను 1960లలో ఫ్రెంచ్ సంగీతకారుడు జిజీ జీన్‌మైర్ పాడారు. కెనడియన్ ఐకాన్ సెలిన్ డియోన్ ప్రదర్శన కూడా ఆకట్టుకుంది.
ఒలింపిక్స్‌లో ఉగ్ర కలకలం..?
ఫ్రాన్స్‌లో హైస్పీడ్ రైళ్ళను లక్ష్యంగా చేసుకుని పలుచోట్ల దాడులు జరిగాయి. పలు రైలు మార్గాలలో మంటలు చెలరేగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా రైల్ నెట్‌వర్క్ స్తంభించడంతో అసలు ఏం జరుగుతుందో అర్థంకాక ప్రయాణికులు కాసేపు గందరగోళానికి గురయ్యారు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు కొన్ని గంటల ముందు ఈ పరిణామం జరగడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఫ్రాన్స్‌లో భద్రతా లోపం మరోసారి తెరపైకి వచ్చింది. దుండగులు రైల్వే నెట్‌వర్క్ కేబుళ్లను కత్తిరించారని, ఈ దుశ్చర్యతో రైళ్ళ రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని ఫ్రాన్స్ రైల్వే వెల్లడించింది.