PKL: వైభవంగా ప్రారంభమైన ప్రో కబడ్డీ లీగ్
విశాఖలో ప్రొ కబడ్డీ లీగ్ 12 సీజన్ ప్రారంభం... హాజరైన క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ... తొలి మ్యాచ్‌లో ఓడిన తెలుగు టైటాన్స్
విశాఖ వేదికగా ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. విశాఖలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ వేడుకకు భారత క్రికెట్ యువ సంచలనం 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. ప్రొ కబడ్డీ లీగ్ 12 సీజన్ ప్రారంభానికి ముందే.. కబడ్డీ మ్యాట్‌పై క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత ఆటగాళ్లతో కలిసి కాసేపి కబడ్డీ కూడా ఆడాడు. అనంతరం 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చేతుల మీదుగా ఈవెంట్ లాంచ్ అయ్యింది. ఇక ఇదే కార్యక్రమంలో కబడ్డీ దిగ్గజం.. అభిమానులు డుబ్కీ కింగ్‌గా పిలుచుకునే పర్దీప్ నర్వాల్‌ను సన్మానించారు. ప్రొ కబడ్డీ లీగ్ చరిత్రలోనే పర్దీప్ నర్వాల్ 1801 రైడ్ పాయింట్లు సాధించి.. అత్యధిక రైడ్ పాయింట్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ సందర్భంగా వైభవ్ మాట్లాడుతూ.. క్రీడలు మనకు క్రమశిక్షణ, టీమ్‌వర్క్ నేర్పిస్తాయి. నేషనల్ స్పోర్ట్స్ డే నాకు స్పూర్తిదాయకం అని వ్యాఖ్యానించాడు.
తెలుగు టైటాన్స్ ఓటమి
ప్రో కబడ్డీ సీజన్ 12ను తెలుగు టైటాన్స్ ఓటమితో ఆరంభించింది. చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో కేవలం 3 పాయింట్ల తేడాతో తెలుగు టైటాన్స్... తమిళ్ తలైవాస్ చేతిలో పరాజయం పాలైంది. ఈ మ్యాచులో 35-38 పాయింట్ల తేడాతో తెలుగుటైటాన్స్ ఓడిపోయింది. తమిళ్ తలైవాస్ జట్టులో అర్జున్ దేశ్వాల్ చెలరేగిపోయాడు. 12 పాయింట్లు సాధించి తమిళ్ తలైవాస్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తెలుగు టైటాన్స్‌లో భరత్ 11 పాయింట్లు సాధించి పోరాడినా అతనికి మద్దతు కరువైంది. తర్వాతి మ్యాచులో జైపుర్‌లో (సెప్టెంబరు 12 నుంచి 28), చెన్నై (29 నుంచి అక్టోబరు 10 వరకు), అలాగే దిల్లీలో (అక్టోబరు 11 నుంచి 23 వరకు ) వరకు మ్యాచ్‌లు జరుగుతాయి.
బలంగా ఉన్నా తప్పని ఓటమి
తెలుగు టైటాన్స్ జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉందని తెలుగు టైటాన్స్ కెప్టెన్ విజయ్మాలిక్ పేర్కొన్నాడు. డిఫెండర్లు అజిత్ పాండురంగ పవార్, అంకిత్, అవి దుహాన్, బంటు, శుభమ్ షిండే, అమన్ రాహుల్ దగార్ ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. జట్టులో శంకర్ భీమరాజ్, భరత్, గణేష్ అద్భుత ప్రదర్శనతో ఆల్‌రౌండర్లు తమ సత్తా చాటనున్నారు. రైడర్లు చేతన్ సాహు, నితిన్, రోహిత్, ప్రఫుల్, జైభగవాన్, ఆశీష్ పాయింట్లు తెచ్చి జట్టుకు బలంగా తోడ్పాటు అందించనున్నారు. ప్రతి మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా పోటీ పడి, ట్రోఫీ సాధించేందుకు ఐక్యంగా కృషి చేస్తామని చెప్పారు.