REVANTH: మెస్సీతో పోరు.. రేవంత్ ముమ్మర ప్రాక్టీస్
మెస్సీతో తలపడేందుకు సిద్ధమవుతున్న సీఎం... డిసెంబర్ 13న హైదరాబాద్‌లో మెస్సీతో పోరు.. సర్కార్ బడుల జట్టుకు సీఎం ప్రాతినిథ్యం.. ప్రాక్టీస్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్
ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీతో తలపడేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సిద్దమవుతున్నారు. డిసెంబర్ 13న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న 7vs7 ఎగ్జిబిషన్ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మెస్సీకి ప్రత్యర్థిగా రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తెలంగాణ సర్కార్ బడులకు చెందిన విద్యార్థుల జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యం వహించనున్నారు. ఈ మ్యాచ్ కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఇందుకోసం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలోని ఫుట్‌బాల్ గ్రౌండ్లో ఆయన ప్రాక్టీస్ ప్రారంభించారు. సీఎంగా రోజంతా ఉన్న కార్యక్రమాలు ముగించుకుని ఆదివారం రాత్రి ఫుట్ బాల్ ఆటగాళ్లతో కలసి మైదానంలోకి దిగారు.ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్లతో కలిసి మ్యాచ్ ఆడారు. సుమారు గంటపాటు ప్రాక్టీస్ చేశారు. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు జొమాటో డిస్ట్రిక్ట్ యాప్‌లో శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ మ్యాచ్ టికెట్ల ధరలు రూ. 1700 నుంచి మొదలవుతాయి. మెస్సీతో కలిసి టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా హైదరాబాద్ రానున్నట్లు ఈవెంట్ ఆర్గనైజర్స్ ప్రకటించారు. మెస్సీతో కలిసి కోహ్లీ, శుభ్‌మన్ గిల్ కూడా ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నారని తెలిపారు. దిగ్గజ ఆటగాళ్లను చూసేందుకు ఇది మంచి అవకాశామని పేర్కొన్నారు. మెస్సీ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అధికారులు హైదరాబాద్ టూర్‌కు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించగా, ఈ పర్యటన పోస్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆవిష్కరించారు. రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలన్న లక్ష్యంతో ‘తెలంగాణ రైజింగ్ 2047’ సంకల్పానికి భాగంగా, మెస్సీని తెలంగాణ గ్లోబల్ బ్రాండ్ అంబాసడర్‌గా ఆహ్వానించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్న సీఎం వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారత్‌లో స్టార్ పర్యటన
డిసెంబర్ 13-15 వరకు మెస్సీ భారత్‌లో పర్యటించనున్నాడు. డిసెంబర్ 13 ఉదయం కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌కు వెళ్లనున్న మెస్సీ.. అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌కు వస్తారు. డిసెంబర్ 14 సాయంత్రం ముంబైలోని వాంఖడే స్టేడియానికి వెళ్తారు. డిసెంబర్ 15 మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీలోకి అరుణ్‌జైట్లీ స్టేడియాన్ని సందర్శిస్తారు. ఇప్పటికే ఈ పర్యటనపై మెస్సీ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. తెలంగాణ రైజింగ్' కార్యక్రమానికి లియోనెల్ మెస్సీని బ్రాండ్ అంబాసీడర్‌గా నియమించాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా క్రీడలు, పర్యాటకం, పెట్టుబడుల ప్రోత్సాహం, యువత భాగస్వామ్యం వంటి విషయాలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ అత్యంత ఇష్టమైన క్రీడ. తాను చదువుకునే రోజుల్లో ఫుట్‌బాల్ ఎక్కువగా ఆడేవారు. మెస్సీ రాకతో స్పోర్ట్స్ హబ్‌గా హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని సీఎం భావిస్తున్నారు. మెస్సీ పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.