IPL: పంత్ పై కాసుల వర్షం
ఐపీఎల్ మెగా వేలంలో గత రికార్డులన్నీ బద్దలు... రూ. 27 కోట్లకు పంత్ ను దక్కించుకున్న లక్నో;
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా విధ్వంసకర వీరుడు .. రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు. గత రికార్డులన్నింటినీ కాలగర్భంలో కలిపేస్తూ... ఐపీఎల్ చరిత్రలో పంత్ రికార్డు నెలకొల్పాడు. రూ. 27 కోట్లకు పంత్‌ను లక్నో దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా పంత్ నిలిచాడు. తొలి సెట్‌లో రిషబ్ పంత్ పేరు రాగానే వేలం నిర్వహించే హాల్‌లో కోలాహలం మొదలైంది. కీపర్–బ్యాటర్ కమ్ కెప్టెన్ ఆప్షన్ కావడంతో సహజంగానే భారీ డిమాండ్ ఏర్పడింది. అతని కోసం మొదట లక్నో, ఆర్‌సీబీ పోటాపోటీగా బిడ్స్ వేస్తూ పది కోట్ల వరకూ వెళ్లాయి. రేటు 11 కోట్లకు చేరుకున్నాక ఆర్‌సీబీ డ్రాప్ అయింది. కానీ, రూ. 11.50 కోట్లతో సన్ రైజర్స్ రేసులోకి వచ్చింది.
వెనక్కి తగ్గని లక్నో
లక్నో ఏమాత్రం వెనక్కుతగ్గకపోవడంతో రేటు 20 కోట్ల మార్కు దాటింది. ఈ దశలో సన్ రైజర్స్ తప్పుకోగా.. లక్నో రూ. 20.75 కోట్ల బిడ్ వేసింది. అదే రేటుకు ఆర్‌టీఎం (రైట్ టు మ్యాచ్) ఆప్షన్‌తో పంత్‌ను తిరిగి తమ జట్టులోకి తీసుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆసక్తి చూపింది. దాంతో, అత్యధిక బిడ్ ఎంతో చెప్పాలని ఆక్షనీర్ అడగ్గా... లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా బిడ్‌ను ఒక్కసారిగా రూ. 27 కోట్లకు పెంచారు. ఢిల్లీ ఆర్‌టీఎంను విత్‌డ్రా చేసుకోవడంతో రిషబ్ పంత్ లక్నో సొంతం అయ్యాడు. . 2008 నుంచి జరుగుతున్న ఈ మెగా లీగ్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఈ తరం ఆటగాళ్లలో డ్యాషింగ్ బ్యాటర్, కీపర్‌గానే కాకుండా కెప్టెన్‌గానూ నిరూపించుకున్న రిషబ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్ నుంచి రూ. 27 కోట్ల మొత్తం అందుకొని ఔరా అనిపించాడు.
మంచి ఫామ్‌లో పంత్
రిషభ్ పంత్ ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్నాడు. పంత్‌కు ఐపీఎల్‌లో మంచి రికార్డు ఉంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 111 మ్యాచ్‌లు ఆడిన పంత్.. 148.93 స్ట్రైక్ రేట్‌తో 3284 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో పంత్ 13 మ్యాచ్‌ల్లో 40 సగటుతో 446 పరుగులు చేశాడు.