SA WIN: టీమిండియాను చిత్తు చేసిన సఫారీలు
రెండో టీ20లో సౌతాఫ్రికా గెలుపు... అన్ని విభాగాల్లో భారత్ విఫలం... 213 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా.. 162 రన్స్‌కే కుప్పకూలిన ఇండియా
న్యూచండీగఢ్ లోని ముల్లాన్‌పూర్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియాకు భారీ పరాజయం మూటగట్టుకుంది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
డికాక్ ఆటే హైలెట్
తొలి టీ 20 మ్యాచ్‌లో విఫలమైన దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్.. ఈసారి చెలరేగిపోయాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగగా.. హెండ్రిక్స్ (8)తో కలిసి డికాక్ పరుగుల వేటను ఆరంభించాడు. అలవోకగా షాట్లు ఆడిన అతడు.. మొత్తం ఏడు సిక్స్‌లు బాదేశాడు. అందులో ఎక్కువగా డీప్ స్క్వేర్ లెగ్ ప్రాంతంలోకి కొట్టాడు. తొలి ఓవర్లో అర్ష్‌దీప్ బౌలింగ్‌లో సిక్స్‌తో మొదలైంది డికాక్ జోరు. ఆ తర్వాత ఏ దశలోనూ తగ్గకుండా భారత బౌలర్లందరినీ సునాయాసంగా ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ వేలానికి కొన్ని రోజుల ముందు ఈ ఇన్నింగ్స్.. డికాక్‌పై ఫ్రాంఛైజీల్లో ఆసక్తిని పెంచుతుందనడంలో సందేహం లేదు. డికాక్ జోరుతో పవర్ ప్లే ముగిసేసరికి 53/1తో నిలిచింది దక్షిణాఫ్రికా. డికాక్ (90; 46 బంతుల్లో 5×4, 7×6) విరుచుకుపడ్డాడు. డొనోవన్ ఫెరీరా (30 నాటౌట్; 16 బంతుల్లో 1×4, 3×6), మిల్లర్ (20 నాటౌట్; 12 బంతుల్లో 2×4, 1×6) విరుచుకుపడడంతో ఆఖరి 3 ఓవర్లలో దక్షిణాఫ్రికా 49 పరుగులు రాబట్టింది.
తిలక్ వర్మ ఒక్కడే...
214 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా చేతులెత్తేసింది. 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. టీ20ల్లో తన బ్యాటింగ్ చర్చనీయాంశగా మారిన నేపథ్యంలో గిల్ వైఫల్యం కొనసాగింది. అతడు ఖాతా అయినా తెరవకుండానే తొలి ఓవర్లో ఎంగిడి బౌలింగ్‌లో వెనుదిరిగాడు. సూర్య కూడా అంతే. పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ నాలుగో ఓవర్లో యాన్సెన్‌కు దొరికిపోయాడు. యాన్సెన్ తన అంతకుముందు ఓవర్లో అభిషేక్ (17)ను వెనక్కి పంపాడు. భారత్ చకచకా మూడు వికెట్లు కోల్పోయిన స్థితిలో తిలక్ నిలబడ్డాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన అక్షర్ పటేల్ (21; 21 బంతుల్లో 1×4, 1×6)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. కాసేపు వికెట్ల పతనం ఆగినా.. అక్షర్ ప్రమోషన్ సత్ఫలితాన్నివ్వలేదు. అక్షర్ ధాటిగా ఆడలేకపోయాడు. తిలక్ వర్మ (62; 34 బంతుల్లో 2×4, 5×6) గట్టిగానే పోరాడినా.. అది సరిపోలేదు. బార్ట్‌మన్ (4/24), యాన్సెన్ (2/25), ఎంగిడి (2/26) భారత్‌ను దెబ్బతీశారు. మూడో టీ20 ఆదివారం ధర్మశాలలో జరుగుతుంది.
హర్ష్‌దీప్ చెత్త రికార్డు
పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తన పేలవ ప్రదర్శనతో అనవసరమైన రికార్డును మూటగట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 11వ ఓవర్లో బౌలింగ్ చేయడానికి వచ్చిన అర్ష్‌దీప్.. పూర్తిగా లయ తప్పి చెత్త రికార్డును నమోదు చేశాడు. ఆ ఒక్క ఓవర్లోనే అర్ష్‌దీప్ ఏకంగా ఏడు (7) వైడ్ బాల్స్ వేశాడు. ఈ వైడ్ల కారణంగా 6 బంతుల ఓవర్ కాస్తా.. ఏకంగా 13 బంతుల మ్యారథాన్ ఓవర్‌గా మారింది. మొత్తంగా ఆ ఓవర్లో అర్ష్‌దీప్ మొత్తం 18 పరుగులు సమర్పించుకున్నాడు.