GILL: గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. భారీ స్కోరు దిశగా భారత్
రెండో టెస్టులో శుభ్‌మన్ గిల్ అద్భుత శతకం... తొలిరోజు 310/5 పరుగులు చేసిన టీమిండియా;
భారత కెప్టెన్ శుభమాన్ గిల్ అద్భుత సెంచరీ (216 బంతుల్లో 114 బ్యాటింగ్ , 12 ఫోర్లు)తో అదరగొట్టాడు. ఇంగ్లాండ్ పర్యటనలో వరుసగా రెండో మ్యాచ్ లోనూ శతకం బాది, తన సత్తా చాటాడు. బుధవారం బర్మింగ్ హామ్ లో ప్రారంభమైన రెండో టెస్టు తొలి రోజు భారత్ ఫర్వాలేదనిపించే రీతిలో రోజును ముగించింది. ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 5 వికెట్లకు 310 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ కు రెండు వికెట్లు దక్కాయి. బ్యాటింగ్ కు అనుకూలించే వికెట్, ఎండ కూడా బాగా కాయడంతో ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్లు ఫ్లాట్ వికెట్ పై ఫర్వాలేదనిపించారు. ఇక ఈ మ్యాచ్ లో భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. జస్ ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్ స్థానాల్లో ఆకాశ్ దీప్ , నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చారు.
రాణించిన గిల్, జైస్వాల్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (114*; 216 బంతుల్లో 12 ఫోర్లు) మరోసారి శతకంతో చెలరేగాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (87; 107 బంతుల్లో 13 ఫోర్లు) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. శుభ్‌మన్ గిల్‌కు తోడుగా రవీంద్ర జడేజా (41*; 67 బంతుల్లో 5 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. కరుణ్ నాయర్ (31; 50 బంతుల్లో), రిషభ్ పంత్ (25; 42 బంతుల్లో) నిలకడగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. కేఎల్ రాహుల్ (2), నితీశ్ రెడ్డి (1) నిరాశపర్చారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. . జో రూట్ బౌలింగ్‌లో గిల్ వరుసగా రెండు ఫోర్లు బాది సెంచరీ (199 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. గిల్, జడేజా జోడీ అభేద్యమైన ఆరో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం (142 బంతుల్లో) నెలకొల్పింది. ఈ ద్వయం రెండో రోజు కూడా ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు రాబడితే మ్యాచ్‌పై భారత్ పట్టు బిగించే అవకాశముంది.
గిల్ సూపర్ రికార్డు
ఇంగ్లాండ్ లో జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ప్రదర్శనతో రికార్డుల మోత మోగిస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో దుమ్మురేపుతున్నాడు. వరుసగా రెండు టెస్ట్ మ్యాచుల్లో సెంచరీలు సాధించిన నాలుగో భారత కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. ఈ జాబితాలో విజయ్ హజారే, సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఒక్కో మ్యాచ్‌లో కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాడు. తాజాగా ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో గిల్ సెంచరీ కొట్టాడు. దీంతో ఇంగ్లాండ్ లో టెస్ట్ కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో చేరాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో గిల్ మరో అరుదైన ఘనత సాధించాడు. మహేంద్ర సింగ్ ధోని 15 అంతర్జాతీయ సెంచరీల రికార్డును గిల్ అధిగమించాడు. గిల్ తన 16వ సెంచరీని ఎడ్జ్‌బాస్టన్‌లో సాధించాడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా గిల్ ఇంగ్లాండ్ బౌలింగ్‌ను ధీటుగా ఎదర్కొంటున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా గిల్ మిడిల్ ఆర్డర్‌ను నిలబెట్టాడు. తొలుత అతను యశస్వి జైస్వాల్‌తో కీలక భాగస్వామ్యం నెలకొల్పగా, జైస్వాల్ 87 పరుగులకు వెనుదిరిగాడు. ఆ తరువాత గిల్, పంత్‌తో కలిసి బ్యాటింగ్‌ను కొనసాగించాడు. పంత్ 23 పరుగులు చేసి ఔటయ్యాడు. లంచ్ బ్రేక్ ముందు కరుణ్ నాయర్‌ను బ్రైడన్ కార్స్ అద్భుతమైన షార్ట్‌బాల్‌తో బోల్తా కొట్టించాడు. కరుణ్ సెకండ్ స్లిప్‌లో బ్రూక్‌కు క్యాచ్ వెనుదిరిగాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో (8.4 ఓవర్) బంతిని డిఫెన్స్ చేయబోయి రాహుల్ బౌల్డయ్యాడు