SAFF Championship: శాఫ్‌ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్‌

శాఫ్‌ ఫైనల్లో భారత్‌... సెమీస్‌లో లెబనాన్ షూటౌట్‌.. టైటిల్‌ ఫైట్‌లో కువైట్‌తో ఛెత్రి సేన అమీతుమీ..;

Update: 2023-07-02 04:00 GMT

దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ శాఫ్‌ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌ షిప్‌లో భారత్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పటిష్ఠమైన లెబనాన్‌తో హోరాహోరిగా సాగిన మ్యాచ్‌లో ఛెత్రి సేన 4-2తో విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించింది. శనివారం హోరాహోరీగా సాగిన సెమీ ఫైనల్‌లో భారత్‌ 4-2తో లెబనాన్‌ను షూటౌట్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడడంతో తొలి అర్ధభాగంలో గోల్స్‌ నమోదు కాలేదు. నిర్ణీత సమయం, ఎక్స్‌ట్రా టైమ్‌లోనూ ఇరు జట్లూ గోల్స్‌ చేయడంలో విఫలం కావడంతో స్కోరు 0-0 తో నిలిచింది. దీంతో మ్యాచ్‌ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. షూటౌట్‌ తొలి షాట్‌ను ఛెత్రి గోల్‌గా మలచగా.. లెబనాన్‌ ఆటగాడు హసన్‌ చేసిన ప్రయత్నాన్ని గోల్‌కీపర్‌ గుర్‌ప్రీత్‌సింగ్‌ సమర్థంగా అడ్డుకున్నాడు. ఆ తర్వాత రెండు షాట్లలో భారత్‌, లెబనాన్‌ సఫలం కావడంతో స్కోరు 3-2తో నిలిచింది. ఈ స్థితిలో భారత ఆటగాడు ఉదాంతసింగ్‌ గోల్‌ కొట్టగా... లెబనాన్‌ స్ట్రైకర్‌ బాబర్‌ విఫలం కావడంతో భారత్‌ను విజయం వరించింది. టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది.


ఆట ఆరంభమైన తొలి 10 నిమిషాలు భారత్‌ను లెబనాన్‌ వణికించింది. రెండో నిమిషంలో నదిర్‌కు సువర్ణావకాశం లభించినా.. షాట్‌ గురి తప్పడంతో భారత్‌ ఊపిరి పీల్చుకొంది. క్రమంగా కుదుటపడిన ఛెత్రి సేన దాడుల ఉధృతిని పెంచింది. 16వ నిమిషంలో లెబనాన్‌ గోల్‌ పోస్టుపై దాడి చేసినా.. గోల్‌ మాత్రం సాధించలేకపోయింది. కాగా, 42వ నిమిషంలో లెబనాన్‌ కెప్టెన్‌ హసన్‌ కొట్టిన కిక్‌ను భారత కీపర్‌ అడ్డుకొన్నాడు. ఇక, సెకండా్‌ఫలో కూడా ఇరు జట్లూ గోల్‌ కోసం తీవ్రంగా పోరాడినా గోల్‌ మాత్రం చేయలేకపోయాయి. ఎక్స్‌ట్రా టైమ్‌లో ఛెత్రికి రెండు చక్కని అవకాశాలు లభించినా.. అతడు టార్గెట్‌ మిస్‌ కావడంతో షూటౌట్‌ అనివార్యమైంది.

మంగళవారం జరిగే టైటిల్‌ ఫైట్‌లో కువైట్‌తో భారత్‌ అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీ్‌స్‌లో కువైట్‌ 1-0తో బంగ్లాదేశ్‌పై గెలిచింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లూ గోల్‌ చేయడంలో విఫలం కావడంతో.. మ్యాచ్‌ ఫలితం అదనపు సమయానికి దారి తీ సింది. అదనపు సమయంలో అబ్దుల్లా అల్‌ బ్లోషి గోల్‌తో కువైట్‌కు విజయాన్నందించాడు.శాఫ్‌ టోర్నీలో భారత్‌ ఫైనల్‌కు చేరడం ఇది 13వసారి. ఇప్పటికే ఎనిమిది సార్లు టైటిల్‌ను సాధించిన టీమిండియా తొమ్మిదో టైటిల్‌ దిశగా సాగుతోంది. ఈ టోర్నీలో అత్యధిక గోల్స్‌ సాధించిన ఛెత్రీ ఫైనల్లోనూ రాణిస్తే భారత్‌కు తిరుగుండదు. సహాల్ అబ్దుల్ సమద్, మహేశ్‌ సింగ్‌, ఉదాంత సింగ్‌లు కెప్టెన్ ఛెత్రీకి అండగా నిలుస్తున్నారు. ఇదే దూకుడును ఫైనల్‌లోనూ ప్రదర్శిస్తే కువైట్‌ను చిత్తు చేయడం పెద్ద కష్టమేమీ కాదని క్రీడా నిపుణులు పేర్కొన్నారు.

Tags:    

Similar News