T20 WORLD CUP: పసికూనతో పోరుకు టీమిండియా సిద్ధం
నేడు భారత్-నమీబియా మ్యాచ్... ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియా... మ్యాచులో సాధికార విజయంపై గురి
టీ20 ప్రపంచకప్ 2026 మరింత ఉత్కంఠభరితంగా సాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు తొలి మ్యాచ్‌లో అమెరికాపై విజయం సాధించి టోర్నీని సానుకూలంగా ప్రారంభించింది. ఇప్పుడు రెండో మ్యాచ్‌లో నమీబియాతో తలపడేందుకు సిద్ధమైంది. నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ పోరు జరగనుంది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికీ, ఆ గెలుపు భారత్‌కు సులభంగా రాలేదు. కీలక సమయంలో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ వరుసగా అవుట్ కావడంతో జట్టు ఒత్తిడిలో పడింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బాధ్యత తీసుకుని అద్భుత ఇన్నింగ్స్ ఆడటం జట్టుకు బలాన్నిచ్చింది. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఒక దశలో 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత జట్టును సూర్యకుమార్ యాదవ్ తన ధైర్యవంతమైన బ్యాటింగ్‌తో గట్టెక్కించాడు. కేవలం 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి జట్టును పోరాడే స్థితికి తీసుకెళ్లాడు. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 161/9 పరుగులు చేయగా, అమెరికా 132 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో భారత్ గ్రూప్ ఏలో రెండు పాయింట్లు, +1.450 నెట్ రన్‌రేట్‌తో అగ్రస్థానంలో నిలిచింది. పాకిస్థాన్‌కీ రెండు పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్‌రేట్ తక్కువగా ఉండటంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడు నమీబియాతో జరిగే మ్యాచ్‌లో భారత్ మరింత సమన్వయంతో ఆడాలని భావిస్తోంది. గత రికార్డులు భారత్‌కే అనుకూలంగా ఉన్నాయి. 2021 టీ20 వరల్డ్ కప్‌లో ఇరు జట్లు ఒకసారి తలపడగా, ఆ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నమీబియాపై కూడా భారత్‌కే పైచేయి ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, టీ20 ఫార్మాట్లో ఎప్పుడైనా ఫలితాలు మారే అవకాశం ఉండడంతో అప్రమత్తత అవసరమని మాజీలు హెచ్చరిస్తున్నారు.
తుది జట్టులో మార్పులు
ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టులో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. తొలి మ్యాచ్‌లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగి నిరాశపరిచాడు. ప్రస్తుతం అతను వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. ఆరోగ్యం మెరుగుపడుతున్నప్పటికీ, నమీబియాతో మ్యాచ్‌లో అతనికి విశ్రాంతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతని స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తుది జట్టులోకి రావచ్చని సమాచారం. ఇప్పటికే ఇషాన్ కిషన్, తిలక్ వర్మ అమెరికాపై పెద్దగా రాణించకపోవడంతో, శాంసన్ రాక జట్టుకు స్థిరత్వాన్ని అందిస్తుందని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. అలాగే గాయం కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తిరిగి జట్టులో చేరనున్నాడు. పూర్తిగా ఫిట్నెస్ సాధించిన సుందర్ ఢిల్లీలో జట్టుతో కలుస్తాడని కెప్టెన్ స్పష్టం చేశాడు. ఢిల్లీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నందున సుందర్ ఎంపిక కీలకంగా మారనుంది. అతను జట్టులోకి వస్తే ఆల్‌రౌండర్ శివమ్ దూబే స్థానంపై ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్–నమీబియా మ్యాచ్‌ను భారత్‌లో జియో హాట్‌స్టార్ యాప్, వెబ్సైట్లలో లైవ్ స్ట్రీమింగ్‌గా వీక్షించవచ్చు. అలాగే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవాలంటే ఈ మ్యాచ్ కీలకం.