T20 WORLD CUP: గెలిచినా టీమిండియాకు తప్పని టెన్షన్
టీమిండియాలో వైఫల్యాలు... నమీబియాతో మ్యాచ్ లో బట్టబయలు... కుప్పకూలిన బ్యాటింగ్.. మిడిలార్డర్ వైఫల్యం... పాక్ మ్యాచ్‌కు వ్యూహం ఏంటి
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 93 పరుగుల భారీ తేడాతో నమీబియాను ఓడించింది. రన్స్ పరంగా టీ20 ప్రపంచ కప్ చరిత్రలో భారత్‌కు ఇది అతిపెద్ద విజయం. గతంలో 2012లో ఇంగ్లండ్ జట్టుపై సాధించిన 90 పరుగుల రికార్డును సూర్య సేన తిరగరాసింది. అయితే ఈ భారీ విజయం వెనుక కొన్ని ఆందోళనకరమైన అంశాలు దాగి ఉన్నాయి. ఇది రాబోయే పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు జట్టును హెచ్చరిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు విధ్వంసకర ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ కేవలం 24 బంతుల్లో 61 పరుగులు చేసి పవర్‌ప్లేలో నమీబియా బౌలర్లను చీల్చిచెండాడాడు. ఫలితంగా భారత్ కేవలం 6.5 ఓవర్లలోనే 100 పరుగుల మైలురాయిని అందుకుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒక జట్టు సాధించిన అత్యంత వేగవంతమైన సెంచరీ ఇదే కావడం విశేషం. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా (52 పరుగులు) తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చి స్కోరును 200 దాటించాడు. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ కేవలం 5 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
భారీ స్కోరు సాధించినప్పటికీ.. టీమిండియా మిడిలార్డర్ ప్రదర్శన ప్రశ్నార్థకంగా మారింది. అమెరికాపై జరిగిన గత మ్యాచ్‌లో లాగే ఇక్కడ కూడా లోయర్ మిడిలార్డర్ తడబడింది. సంజూ శాంసన్ ఆరంభం బాగున్నా దానిని భారీ ఇన్నింగ్స్‌గా మార్చలేకపోయాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కేవలం 12 పరుగులకే వెనుదిరగగా.. రింకూ సింగ్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏమిటంటే.. ఇన్నింగ్స్ చివరలో భారత్ కేవలం 5 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోవడం. ఇది జట్టు బ్యాటింగ్ లైనప్, ఒత్తిడిలో ఆడే తీరుపై అనుమానాలను రేకెత్తిస్తోంది.
బలహీనతలను బయటపెట్టిన స్పెల్
నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఇరాస్మస్ వేసిన బౌలింగ్ స్పెల్ భారత బ్యాటర్ల బలహీనతలను బయటపెట్టింది. 4 వికెట్లు తీసి భారత జోరుకు అడ్డుకట్ట వేసిన ఇరాస్మస్ బౌలింగ్ తీరు.. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో పాక్ 'మిస్టరీ' స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ నుంచి ఎదురయ్యే సవాళ్లను గుర్తు చేస్తోంది. సైడ్-ఆర్మ్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో భారత్ ఇంకా మెరుగుపడాల్సి ఉందని ఈ మ్యాచ్ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో జరిగే పోరు సూపర్-8 దిశగా భారత్‌కు అత్యంత కీలకం. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే భారత్ తన మిడిలార్డర్ స్థిరత్వంపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా చివరలో వికెట్లు పారేసుకోకుండా జాగ్రత్త పడాలి. నమీబియాపై విజయంతో వచ్చిన ఉత్సాహాన్ని కొనసాగిస్తూనే, బ్యాటింగ్‌లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటేనే చిరకాల ప్రత్యర్థిపై పైచేయి సాధించే అవకాశం ఉంటుంది.
ఆశలు రేపుతున్న స్పిన్ జోడీ
బ్యాటింగ్‌లో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. బౌలింగ్ విభాగంలో భారత్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. వరుణ్ చక్రవర్తి (2 ఓవర్లలో 3/7) తన మ్యాజిక్ స్పిన్‌తో నమీబియాను కోలుకోకుండా చేయగా.. అక్షర్ పటేల్ తన కంట్రోల్ బౌలింగ్‌తో రెండు వికెట్లు తీసి ఒత్తిడి పెంచాడు. హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ ప్రదర్శనతో 2 వికెట్లు తీసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలవడం పాకిస్థాన్ జట్టుకు గట్టి హెచ్చరికే అని చెప్పాలి.