T20 WORLDCUP: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ మార్పు..!
ఐసీసీలో ఫిర్యాదు చేసిన బంగ్లాదేశ్... భారత్‌లో ఆడలేమంటూ ఫిర్యాదు... కొత్త షెడ్యూల్ రూపకల్పనలో ఐసీసీ
భారత్–బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పుడు క్రికెట్ రంగానికీ విస్తరించాయి. ఐపీఎల్ ఫ్రాంచైజీ నుంచి బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజూర్ రహమాన్‌ను విడుదల చేయడంతో మొదలైన వివాదం, ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్ నిర్వహణపై ప్రభావం చూపే స్థాయికి చేరింది. భారత్‌లో తమ మ్యాచ్‌లు ఆడటం సాధ్యం కాదని పేర్కొంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు అధికారికంగా లేఖ రాసినట్లు సమాచారం. భద్రతా కారణాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ, భారత్‌లో జరగాల్సిన తమ వరల్డ్‌కప్ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని బీసీబీ కోరింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఐసీసీ కొత్త షెడ్యూల్ రూపొందించే దిశగా సమీక్ష ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఐసీసీ చైర్మన్ జై షా నేతృత్వంలో ఈ అంశంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ముస్తఫిజూర్ విడుదలైన వెంటనే బీసీబీ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఆ తర్వాత ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, తమ టీమ్ భద్రతపై ఆందోళనలు ఉన్నాయని, అందుకే భారత్‌లో జరిగే తమ అన్ని మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరినట్టు వెల్లడించింది. ఈ నిర్ణయం భారత్–పాకిస్తాన్ తరహాలో మరో క్రికెట్ రాజకీయ వివాదంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలకు రాజకీయ నేపథ్యమూ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో భారత్–బంగ్లాదేశ్ సంబంధాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ అంశం రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.
నెలరోజులే సమయం
టోర్నీ ప్రారంభానికి ఇంకా నెల రోజులే ఉండటంతో షెడ్యూల్ మార్పు ఐసీసీకి పెద్ద లాజిస్టిక్ సవాలుగా మారనుంది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తమ గ్రూప్–సీ మ్యాచ్‌లలో మూడు కోల్‌కతాలో ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 7న వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్, ఫిబ్రవరి 9న ఇటలీతో, ఫిబ్రవరి 14న ఇంగ్లండ్‌తో కోల్‌కతాలో మ్యాచ్‌లు ఉన్నాయి. గ్రూప్ దశలో చివరి మ్యాచ్ ఫిబ్రవరి 17న ముంబై వాంఖడే స్టేడియంలో నేపాల్‌తో జరగాల్సి ఉంది. ఈ వ్యవహారంలో రాజకీయ ఒత్తిళ్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తరఫున యువజన, క్రీడల శాఖ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ తీవ్రంగా స్పందించారు. “బంగ్లాదేశ్ క్రికెట్, క్రికెటర్లకు అవమానం జరిగితే మేం ఊరుకోం. బానిసత్వం రోజులు పోయాయి. ఒక బంగ్లాదేశ్ క్రికెటర్ భారత్‌లో ఆడలేని పరిస్థితి ఉంటే, మొత్తం జట్టు అక్కడికి వెళ్లడం సురక్షితం కాదనే భావన కలుగుతుంది” అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. బీసీబీ తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని కోరాలని తానే సూచించానని కూడా ఆయన వెల్లడించారు. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేయాలంటూ సంబంధిత వర్గాలకు లేఖ రాసినట్టు నజ్రుల్ తెలిపారు. బీసీబీ ఐసీసీకి లేఖ రాయడాన్ని స్వాగతిస్తూ, బీసీసీఐ విధానాలపై ఆయన విమర్శలు గుప్పించారు. బంగ్లాదేశ్ ఇప్పటికే జట్టును ప్రకటించింది. లిట్టన్ కుమార్ దాస్ సారథ్యంలో జట్టు టోర్నీకి సిద్ధమవుతోంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ 20 జట్ల టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఎనిమిది వేదికల్లో జరగనుంది.