TEAM INDIA: సెమీస్ చేరాలంటే వ్యూహాలు మారాల్సిందే
సూపర్ 8లో వ్యూహాలు రీసెట్ కావాలి... సఫారీలతో మ్యాచ్ స్పష్టమైన సందేశం.. గంభీర్ వ్యూహాలపై తీవ్ర విమర్శలు
అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2026 సూపర్ 8 మ్యాచ్‌లో టీమ్ఇండియా ఎదుర్కొన్న ఘోర పరాజయం కేవలం ఓ ఓటమిగానే కాకుండా జట్టు ఎంపికపై పెద్ద చర్చకు దారితీసింది. వరుసగా నాలుగు విజయాలతో గ్రూప్ దశను దాటిన భారత జట్టు, దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో ఓడిపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. అయితే ఈ మ్యాచ్‌లో జరిగిన ఒక నిర్ణయం వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్‌ను తప్పించి వాషింగ్టన్ సుందర్‌ను తుదిజట్టులోకి తీసుకోవడం ఇప్పుడంతా చర్చనీయాంశంగా మారింది. మూడు మ్యాచ్‌లు ఆడి 6 వికెట్లు తీసిన అక్షర్ పటేల్ సగటు 12.16, ఎకానమీ 6.63. ఇలాంటి గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌ను కీలక మ్యాచ్‌లో బయటపెట్టడం ఆశ్చర్యమే. గ్రూప్ దశలో అతను సూపర్ ఫామ్‌లో కనిపించాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగిన పోరులో 2/29 గణాంకాలతో మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఎడమచేతి స్పిన్నర్‌గా జట్టుకు వైవిధ్యం తీసుకొచ్చే అతను, బ్యాటింగ్‌లోనూ విలువైన పరుగులు చేయగల సామర్థ్యం ఉన్న ఆల్‌రౌండర్. అహ్మదాబాద్ అతని సొంత నగరం కావడం, నరేంద్ర మోదీ స్టేడియంలో మంచి రికార్డు ఉండడం కూడా అతనికి అనుకూల అంశాలే.
అయితే జట్టు యాజమాన్యం అక్షర్‌ను తప్పించి ఇటీవల అంతగా మ్యాచ్‌లు ఆడని వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేసింది. గాయమేమైనా ఉందేమో అన్న అనుమానాలు వచ్చినా, అది కాకుండా వ్యూహాత్మక నిర్ణయంగా తీసుకున్నట్టు స్పష్టమైంది. కానీ మ్యాచ్‌లో సుందర్‌తో కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయించడం, అతను 17 పరుగులు ఇచ్చి వికెట్ తీయకపోవడం ఈ నిర్ణయంపై మరింత ప్రశ్నలు లేవనెత్తింది. బ్యాటింగ్‌లోనూ అయిదో స్థానంలో వచ్చిన సుందర్ 11 పరుగులకే పరిమితమయ్యాడు. అతడిని అంత ఎత్తులో ఆడించడం వ్యూహాత్మక తప్పిదంగా కనిపించింది. ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ ఐసీసీ టోర్నమెంట్లలో జట్టు స్థిరత్వం అత్యంత కీలకమని పేర్కొన్నాడు. ఐపీఎల్ లాంటి దీర్ఘ టోర్నమెంట్లలో మార్పులు సహజమని, కానీ ప్రపంచకప్‌లాంటి ప్రధాన టోర్నీల్లో స్థిరమైన కాంబినేషన్‌ను కొనసాగించాల్సిన అవసరం ఉందని వివరించాడు. ఎడమచేతి బ్యాటర్లను ఎదుర్కొనేందుకు సుందర్‌ను ఎంపిక చేయడాన్ని తాను పూర్తిగా వ్యతిరేకించడం లేదని చెప్పినా, టీ20 ఫార్మాట్లో అక్షర్ పటేల్ ఎంత ముఖ్యమైన ఆటగాడో గుర్తుచేశాడు.
అశ్విన్ మరో ముఖ్య అంశాన్ని కూడా ప్రస్తావించాడు. గత టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో అక్షర్ పటేల్ చేసిన ప్రదర్శనను గుర్తు చేశాడు. ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన అక్షర్, విరాట్ కోహ్లీతో కలిసి 72 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును 170 పరుగుల మార్క్ దాటేలా చేశాడని పేర్కొన్నాడు. అలాంటి మ్యాచ్-విన్నింగ్ సామర్థ్యం ఉన్న ఆటగాడిని కీలక సమయంలో పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డాడు. ఇదే కాకుండా రింకు సింగ్‌ను నంబర్ 8లో బ్యాటింగ్‌కు పంపడాన్ని కూడా అశ్విన్ తప్పుబట్టాడు. జట్టులో ఇప్పటికే ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్నప్పటికీ అతడిని అంత దిగువన ఆడించడం అర్థం కాని వ్యూహమని పేర్కొన్నాడు. సుందర్‌ను అగౌరవపరచాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేసినా, సరైన సన్నద్ధత లేకుండా కీలక మ్యాచ్‌లకు రావొద్దని సూచించాడు. ఈ ఓటమి గుణపాఠంగా మారాలని అభిప్రాయపడ్డాడు.