dhoni: ధోనీ రిటైర్మెంట్‌కు సమయం వచ్చేసిందా..?

ధోనీ వీడ్కోలుకు సమయం ఆసన్నమైందంటున్న మాజీలు;

Update: 2025-05-22 05:00 GMT

 ఈ ఏడాది కూడా ఐపీఎల్‌లో ధోనీ రిటైర్‌మెంట్‌పైనే చర్చ జరుగుతోంది. ధోనీ రిటైర్ అవ్వాలని కొందరు... మరికొంతకాలం కొనసాగాలని ఇంకొందరు వాదోపవాదాలు చేసుకుంటున్నారు. గత సీజన్‌లో ధోనీ మోకాలి సమస్యతో ఇబ్బంది పడ్డాడు. శస్ర్తచికిత్స తర్వాత కోలుకుని తిరిగి ఈ సీజన్‌ ఆడుతున్నాడు. అయిదుసార్లు ఐపీఎల్‌ టోర్నీ విజేతగా నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు, ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శనతో తేలిపోయింది. 16 ఏళ్ల చెన్నై సూపర్‌కింగ్స్ చరిత్రలో ప్లేఆఫ్స్‌నకు దూరమవడం ఇది మూడోసారి మాత్రమే. ప్రస్తుత సీజన్‌లో చెన్నై ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడితే అందులో కేవలం మూడింట్లో మాత్రమే విజయం సాధించింది. 10 మ్యాచుల్లో పరాజయం పాలైంది. దీంతో 6 పాయింట్లతో పట్టికలో పదోస్థానానికి పరిమితమైంది. అయితే ధోనీ విషయంలో మాజీలు పలు రకాల స్పందిస్తున్నారు.

విశ్రాంతికి వేళైంది: జోగిందర్‌ శర్మ

**ధోనీ ఫిట్‌నెస్ స్థాయిని పరిగణనలోకి తీసుకుంటే, అతను దాన్ని నిరూపించుకోవడానికి ఆడాలని మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ అన్నాడు. కానీ ఇప్పుడు ధోనీ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తాను బలంగా నమ్ముతున్నట్లు వెల్లడించాడు.**

నిర్ణయం ధోనీదే: కృష్ణమాచారి శ్రీకాంత్‌

ఐపీఎల్‌లో కొనసాగాలా.. లేదా రిటైర్మెంట్‌ తీసుకోవాలా... అనే నిర్ణయం తన శారీరక స్థితి ఆధారంగా ధోనీనే నిర్ణయం తీసుకోవాలని దిగ్గజ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్‌ అన్నాడు. కానీ ఈ వయసులోనూ కొనసాగడం మాత్రం అంత తేలికైన విషయం కాదన్న శ్రీకాంత్... శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి ఎంతో కసరత్తు చేయాల్సి ఉంటుందన్నాడు. అయితే తాను వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో ఆడాలా.. లేదా.. అనే విషయం తన శరీరమే తనకు చెబుతుందని ధోని స్పష్టం చేశాడు. దాని ఆధారంగానే తాను నిర్ణయం తీసుకుంటానని వెల్లడించాడు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌ ముగిసిన తర్వాత నా చేతిలో 6 నుంచి 8 నెలల సమయం ఉంటుందని... అప్పుడు నా శరీరం ఎలా స్పందిస్తుందో చూస్తా. ఒత్తిడిని తట్టుకోగలుగుతుంది అనుకుంటే కొనసాగుతానని తెలిపారు.

 కోచ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

IPL-2025లో CSK జట్టు దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 'మేం అట్టడుగున ఉండడం నాకు నచ్చట్లేదు. మెరుగైన ప్రదర్శన చేయాలనే అనుకున్నాం. మేం ఆడిన తీరు ప్రకారం చూస్తే.. కింద ఉండడమే సమంజసం. ఇందులో దాచేదేమీ లేదు. వచ్చే సీజన్‌ కోసం బలమైన ఆలోచనలతో ఉన్నాం. మా లోపాలు సరిదిద్దుకుంటాం' అని అన్నారు.

Tags:    

Similar News