ENG vs IND: టీమిండియాకు బిగ్‌ సవాల్‌.. బజ్‌ బాల్‌..

ఇంగ్లాండ్ ఆయుధంగా మారిన స్ట్రాటజీ... తొలి టెస్టులో భారత్ ఓటమికి కారణమిదే;

Update: 2025-06-30 06:30 GMT

అండర్సన్-టెండూల్కర్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ తొలి టెస్ట్ ఓడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్ డబ్ల్యూటీసి పాయింట్ల పట్టికలోను ప్రమాదకరమైన స్థానంలోకి పడిపోయింది. ఇక డబ్ల్యూటీసికి క్వాలిఫై కావాలంటే భారత్ దాదాపు మిగతా మ్యాచ్‌లన్ని గెలవాలి. కానీ.. ఇది యువ భారత జట్టుకు పెద్ద పరీక్షే. టీమిండియాలో సీనియర్లు లేరు, ఇంగ్లాండ్ బలమైన జట్టు అనేది ప్రధాన సమస్య కాదు. బజ్ బాల్.. ఇంగ్లాండ్ బలమైన శస్త్రం ఇది. తొలి టెస్టులో నాలుగవ రోజు వరకు ఆధిక్యంలో ఉన్న భారత్ అనూహ్యంగా 5వ రోజు ఆటలో ఓడిపోయింది. ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ సృష్టి, కెప్టెన్ బెన్ స్టోక్స్ సారథ్యంలో ఇంగ్లాండ్ టెస్టుల్లో వెనక్కి తిరగకుండా దూసుకుపోయేలా చేస్తున్న స్ట్రాటజీ ఇది.

ఏంటి ఈ బజ్ బాల్

'బజ్ బాల్..' ఇంగ్లాండ్ జట్టు టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది అంటే చాలు ఎక్కువుగా వినపడే పదం. దూకుడుగా ఆడటమే బజ్ బాల్ కాన్సెప్ట్. అంతకుమించి మరొకటి లేదు. టెస్ట్ మ్యాచ్ కదా! ఐదురోజులు తీరుగ్గా ఆడదామన్నా ఆలోచన ఉండదు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లయిన వన్డే, టీ20 తరహాలో ధనాధన్ మెరుపులు ఉంటాయి. బౌలింగ్ శైలి అలానే ఉంటుంది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ ఇంగ్లాండ్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాక ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగడమే ఇంగ్లండ్ బ్యాటర్ల పని. ఓవర్‌కు మూడు నుంచి నాలుగేసి బౌండరీలు బాదుతూ టీ20 తరహాలో బ్యాటింగ్ చేస్తారు. దీంతో ప్రత్యర్థి ఆటగాళ్లు ఒత్తిడిలోకి జారుకుంటారు. అదే వారిని విజయాల బాట పట్టించింది. గతేడాది చివరలో పాకిస్థాన్‌లో పర్యటించిన ఇంగ్లాండ్ జట్టు.. వారికీ ఈ రుచి చూపించింది. మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. సెంచరీలు, డబులు సెంచరీలు చేస్తూ పాక్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు.

 మెక్‌ 'బజ్'

ధాటిగా ఆడటంలో బ్రెండన్ మెక్‌కల్లమ్‌ది మరో లెవెల్. అందరూ టీ20 ఫార్మాట్ మొదలయ్యాక దూకుడుగా ఆడటం మొదలెట్టారేమో కానీ, మెక్‌కల్లమ్ ఎప్పుడో మొదలెట్టేశాడు. ఐపీఎల్ టోర్నీలో తొలి సెంచరీ చేసిన ఆటగాడు కూడా మెక్‌కల్లమే. బాల్ పడిందంటే ఫ్రంట్ ఫుట్ రావడం.. బంతిని బౌండరీకి తరలించడం అతని ప్రత్యేకత. అతన్ని అందరూ 'బజ్' అని పిలుస్తారు. ఆ కారణంగానే 'బజ్ బాల్..' అని పిలవడం మొదలుపెట్టారు.

Tags:    

Similar News