TeamIndia : 37ఏళ్ల తర్వాత మరోసారి టీమిండియా చెత్త రికార్డు

Update: 2024-10-18 00:30 GMT

టెస్టు క్రికెట్ లో టీమిండియా అత్యంత చెత్త రికాడ్డు నెలకొల్పింది. న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ ఘోరంగా విఫలమైంది. కేవలం 46 పరుగులకే కుప్పకూలి చెత్త రికార్డును నెలకొల్పింది. ఇప్పటివరకు టెస్టుల్లో టీమిండియా అత్యల్ప స్కోరు 75 పరుగులు. 1987లో ఢిల్లీ టెస్టులో వెస్టిండీస్ పై భారత్ 75 పరుగులకే ఆలౌటైంది. దీంతో 37 ఏళ్ల తర్వాత మరసారి టీమిండియాపై చెత్త రికార్డు నమోదు అయ్యింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ తడబడితే.. న్యూజిలాండ్ అదరగొడుతోంది. దీంతో తొలి టెస్టులో భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. తొలుత బంతితో అదరగొట్టిన కివీస్.. తర్వాత బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుతోంది. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ జట్టు 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఓపెనర్ డేవాన్ కాన్వే (91, 105 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడి శతకం ముంగిట పెవిలియన్ చేరాడు. విల్ యంగ్ (33), టామ్ లాథమ్ (15) పరుగులు చేశారు. క్రీజులో రచిన్‌ రవీంద్ర (22), డారిల్ మిచెల్(14)లు ఉన్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ 134 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత బౌలర్లలో కుల్‌దీప్‌ యాదవ్, రవీంద్ర జడేజా, అశ్విన్‌ తలో వికెట్ పడగొట్టారు.

హడలెత్తించిన కివీస్ బౌలర్లు

స్వదేశంలో తిరుగులేదని జోష్ మీదున్న భారత్‌కు దిమ్మదిరిగేలా కివీస్‌ బౌలర్లు దెబ్బకొట్టారు. వర్షం కారణంగా తొలిరోజు రద్దైన మొదటి టెస్టు రెండోరోజు ఆటలో మాత్రం టీమ్‌ఇండియా బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. ప్రస్తుతం లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై కివీస్‌ చెలరేగిపోయింది. పరుగుల సంగతి పక్కనపెడితే.. బంతిని ఎదుర్కోవాలంటే భారత బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. నలుగురు టాప్‌ క్లాస్‌ బ్యాటర్లు డకౌట్‌గా పెవిలియన్‌కు చేరడం గమనార్హం. ఈ క్రమంలో రిషభ్ పంత్ (20), యశస్వి జైస్వాల్ (13) కాసేపు పోరాడారు. అయితే, కివీస్ బౌలర్లు చెలరేగడంతో భారత్ 31.2 ఓవర్లలోనే 46 పరుగులకే ఆలౌటైంది. కివీస్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ 5 వికెట్లు, ఓరౌర్కీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. టిమ్‌ సౌథీ ఓ వికెట్‌ తీశాడు.

భారత్ లో ఆ ఆట లోపించింది: అనిల్‌ కుంబ్లే

న్యూజిలాండ్‌తో మొదలైన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా ఘోరంగా విఫలమవడంపై మాజీ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టులో ఒక రకమైన ఆటతీరు లోపించిందన్నాడు. భారత్‌ పూర్తిగా ఎదురు దాడి చేద్దామని ప్రయత్నించిందని అభిప్రాయపడ్డాడు. ‘విరాట్‌ కోహ్లీ నాలుగో స్థానంలోనే బరిలోకి దిగాలి. ఆ స్థానంలో అతడే మీ టాప్‌ బ్యాటర్‌. ఇక 3వ స్థానం కోసం ఛతేశ్వర్‌ పుజారా వంటి ఆటగాడు అవసరం. కొన్నేళ్లపాటు నెంబర్‌-3గా అతడు జట్టుకు సేవలు అందించాడు. నేడు పుజారా జట్టులో ఉంటే.. అలా వికెట్‌ పోగొట్టుకొనేవాడు కాదు. బంతి మీదకు వచ్చే వరకు ఆగి ఓపిగ్గా ఆడేవాడు. జట్టులో అలాంటి ఆటగాడు లోపించాడు. ఆ రకమైన ఆట లోపించింది. ఈ అంశంలో భారత్‌ కచ్చితంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది’ అని కుంబ్లే పేర్కొన్నాడు.

Tags:    

Similar News