ROHIT: టెస్ట్ క్రికెట్‌లో ముగిసిన రోహిత్ శకం
సుదీర్ఘ ఫార్మాట్‌కు హిట్‌మ్యాన్ గుడ్‌బై... సంచలన ప్రకటన చేసిన రోహిత్. వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతానని వెల్లడి;
భారత క్రికెట్ జట్టు సీనియర్ ఆటగాడు, కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి తక్షణమే వైదొలుగుతున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అయితే వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతానని రోహిత్ వెల్లడించాడు. రోహిత్ సంచలన నిర్ణయంతో సుదీర్ఘ ఫార్మాట్‌లో హిట్ మ్యాన్ 11 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు తెరపడింది. . 'అందరికీ నమస్కారం.. నేను టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నా. సుదీర్ఘ ఫార్మాట్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఈ ప్రయాణంలో నాపై చూపించిన ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతాను.'అని రోహిత్ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.
రోహిత్ కెరీర్ ఇలా..
రోహిత్ శర్మ తన టెస్ట్ ప్రస్థానంలో మొత్తం 67 మ్యాచ్‌లు ఆడాడు. 2022లో విరాట్ కోహ్లీ నుంచి టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రోహిత్, 24 మ్యాచ్‌లలో జట్టును నడిపించాడు. తన కెరీర్‌లో మొత్తం 4301 పరుగులు సాధించిన రోహిత్, ఇందులో 12 శతకాలు నమోదు చేశాడు. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా రెండు సార్లు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పైనల్‌కు చేరింది. అయితే ఇటీవలి కాలంలో రోహిత్ టెస్ట్ క్రికెట్‌లో పెద్దగా రాణించలేకపోతున్నాడు. టెస్ట్ మ్యాచ్‌ల్లో అతడి కెప్టెన్సీ కూడా ఆశించిన స్థాయిలో లేదు. రోహిత్ సారథ్యంలోని టీమిండియా గత ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట్లో ఓటమిపాలైంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌ల్లో ఓటమి పాలైంది. వ్యక్తిగతంగా రోహిత్ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. సిడ్నీ టెస్ట్ నుంచి స్వయంగా తప్పుకున్నాడు.
తదుపరి కెప్టెన్ ఎవరో..?
త్వరలో టీమిండియా టెస్ట్, వన్డే సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ వెళ్లబోతోంది. ఈ నేపథ్యంలో టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్‌కు ఇవ్వకూడదని అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారులకు అగార్కర్ వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ ఏకంగా తన టెస్ట్ కెరీర్‌కే ఫుల్‌స్టాప్ పెట్టేశాడు. మరి, రోహిత్ రిటైర్మెంట్‌తో టీమిండియా టెస్ట్ కెప్టెన్ ఎవరనే ఆసక్తి నెలకొంది. జస్‌ప్రీత్ బుమ్రా, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, పంత్ టెస్ట్ కెప్టెన్ రేసులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.