TEAM INDIA: ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీమిండియా
రోహిత్ -విరాట్ కోసం ఎగబడ్డ ఫ్యాన్స్.. అక్టోబర్ 19 నుంచి ఆసీస్ - భారత్ వన్డే సిరీస్... అక్టోబర్ 19వ తేదీన పెర్త్‌లో తొలి వన్డే
టీమిండియా ప్లేయర్లు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టారు. ప్లేయర్లకు వీడ్కోలు పలికేందుకు అభిమానులు ఎయిర్‌పోర్టుల వద్ద కోలాహలం చేశారు. ముఖ్యంగా రోహిత్ శర్మ , విరాట్ కోహ్లిల కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఈ ఇద్దరు లెజెండ్రీ ఆటగాళ్లు మళ్లీ భారత జెర్సీలో కనిపించనుంది ఆసీస్ సిరీస్‌తోనే. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు స్క్వాడ్ బుధవారం ఉదయం పయనమైంది. అక్టోబర్ 19 నుంచి ఈ వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా.. మొదటి వన్డే పెర్త్ వేదికగా జరగనుంది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 నేపథ్యంలో సెలక్ట్ చేసిన ఈ జట్టుకు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. ముఖ్యంగా సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భవితవ్యం కూడా ఈ సిరీస్‌లోనే తేలనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో విజేతగా నిలిచిన తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. బీసీసీఐ ఒత్తిళ్లతో రోహిత్ గుడ్ బై చెప్పగా, కోహ్లి మాత్రం రోహిత్‌ను అనుసరిస్తూ రిటైర్మెంట్ ఇచ్చాడు. ఈ ఇద్దరు ఆటగాళ్ల రిటైర్మెంట్ విషయంలో తమ పాత్ర లేదని బీసీసీఐ చెబుతున్నా.. క్రికెట్ విశ్లేషకులు మాత్రం కోచ్ గంభీర్, సెలక్టర్ అజిత్ అగార్కర్ ఒత్తిళ్లతోనే వారు రిటైర్మెంట్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
టీమిండియాకు బిగ్ షాక్!
టీమిండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబే గాయం కావడంతో క్రికెట్ ఫ్యాన్స్‌తో ఆందోళన వ్యక్తమవుతుంది. అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు కొన్ని రోజుల ముందు ఈ స్టార్ ఆటగాడు గాయంతో ఇబ్బంది పడటం.. జట్టు వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. శివమ్ దూబే వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నాడని సమాచారం. రంజీ ట్రోఫీ 2025లో భాగంగా ముంబై జట్టు జమ్మూ కాశ్మీర్‌తో శ్రీనగర్‌లో ఆడే తొలి మ్యాచ్‌కు కూడా శివమ్ దూబే అందుబాటు ఉండటం లేదు. వాస్తవానికి రంజీ మ్యాచ్ కోసం ముంబై జట్టుతో కలిసి దూబే శ్రీనగర్‌కు వెళ్లాడు. అయితే అక్కడి తీవ్రమైన చల్లని వాతావరణం దూబే వెన్నునొప్పి వచ్చినట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియాకు డబుల్ షాక్!
ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు భారత్‌తో జరగబోయే తొలి వన్డేకు దూరమయ్యారు. ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా, వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ మొదటి వన్డే మ్యాచ్ కు అందుబాటులో ఉండడం లేదు. ఆడమ్ జంపా, జోష్ ఇంగ్లిష్ స్థానంలో మాథ్యూ కుహ్నెమాన్, జోష్ ఫిలిప్‌లను జట్టులోకి తీసుకున్నారు. అయితే జోష్ ఫిలిప్ మొదటిసారి వన్డేలలో వికెట్ కీపింగ్ చేయనున్నాడు. . జంపా తండ్రి కానున్నాడు. అతడి భార్య త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ క్రమంలోనే అతడు తొలి వన్డేకు అందుబాటులో ఉండడం లేదు. అయితే అతను సిరీస్‌లోని చివరి రెండు వన్డేలకు అందుబాటులో ఉంటాడని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.